Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వేల మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
- ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు నిషేధం
- పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి దాదాపు పది రోజులకు పైగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
దీంతో అసెంబ్లీ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వేల మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం ఎదుట బారీ కేడ్లను ఏర్పాటు చేసి అడుగడుగునా సాయుధ పోలీసులను నియమిం చారు. రెండు ప్రధాన గేట్ల వద్ద అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ఇంచార్జీలుగా నియమించి కేవలం పాసులున్నవారికి మాత్రమే లోనికి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ లాబీ ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా సోదా చేసి లోనికి ఒదిలేలా భద్రతా అధికారులను ఆదేశించారు. అలాగే, అసెంబ్లీకి కిలో మీటర్ దూరం వరకు ఎలాం టి ధర్నాలు, ర్యాలీలు, పికెటింగ్‌లు, రాస్తా రోకోలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిషేదాజ్ఞలు విధించారు. అలాగే, అసెంబ్లీ ప్రాంగణంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి అందులో నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి చెందిన బాంబ్ సెర్చింగ్ స్క్వాడ్లతో అసెంబ్లీ ప్రాంగణంతో పాటు లోపల సెక్యూరిటీ అధికారులు సోదాలను నిర్వహించారు. అలాగే, అసెంబ్లీ వైపునకు వచ్చే మార్గాలలోని చౌరస్తాలలో ఆందోళన కారులెవరూ శాసనసభ వైపునకు చొచ్చుకురాకుండా చూడటానికి సాయుధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేశారు.