Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించిందని విమర్శించారు. దశల వారీగా ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉపాధి హామీ చట్టం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం ఉండగా, బడ్జెట్లో కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.
గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బీజేపీ ప్రభుత్వం, ఉన్న ఉపాధి కార్యక్రమాలను సైతం అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధి హామీ చట్టం జేఏసీ చైర్మెన్ యలబద్రి లింగయ్య, కో చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి , విజయ్ కుమార్ , రఘు , సర్దార్ సింగ్ , అంజి రెడ్డి , సుదర్శన్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.