Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 నుంచి 35 రోజులు అసెంబ్లీ నిర్వహించాలి :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా ప్రజల గొంతుకగా అసెంబ్లీలో గళం వినిపిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలన్నిటిని పరిష్కరించాలని ప్రస్తావిస్తామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 30 నుంచి 35 రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడారు. గత ఎనిమిదేండ్లుగా నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు, రుణమాఫీ, పోడు భూముల సమస్యలు, ధరణి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన కరెంటు చార్జీల తదితర అంశాలపై నిలదీస్తామన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత రెండేండ్లుగా మోడీ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులను కోత పెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని చేసిన అతిపెద్ద ఆర్థిక నేరం గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రమంతా చేసే పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పాదయాత్ర చేయమని అధిష్టానం ఆదేశిస్తే కచ్చితంగా రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.