Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట పేరుతో ప్రచారం చేసుకోవటం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) తెలిపింది. గురువారం ఈ మేరకు ఆ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు వి.కృష్ణమోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాత పన్ను విధానాన్ని ఎత్తేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని తెలిపారు. పరోక్ష పన్నుల ద్వారా వేతనాల నుంచి ఆదాయాన్ని రాబట్టుకుంటున్న ప్రభుత్వం వాటిపై భారీగా పన్ను వేయటమే అర్థరహితమని విమర్శించారు. కార్పొరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీ ఇచ్చిన ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదని పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం అధికాదాయ వర్గాలకు మాత్రమే కొంతమేర ఉపయోగపడు తుందని తెలిపారు. తక్కువ వేతనాదాయ వర్గాలు వినియోగించుకుంటున్న పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచటం నామ మాత్రమేనని తెలిపారు. పొదుపు మొత్తాలపై రాయితీని రూ.1.50 లక్షలను అలాగే కొనసాగించారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో లేనప్పుడు దాన్ని రూ.3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గృహ నిర్మాణానికి ప్రోత్సాహం లేదని వివరించారు. కేంద్రం ఎన్నికలకు ముందు ప్రతిపాదించిన ఆఖరి పూర్తి బడ్జెట్ సగటు వేతన జీవులకు ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదని విమర్శించారు.