Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిలదీస్తాం : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులమయంగా మార్చాడనీ, ఇప్పుడు దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని విమర్శించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం ఎన్నికల కోసం కాకుండా దేశ వాస్తవిక అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. కేసీఆర్‌లా మాయమాటలు చెప్పి మోసం చేయడం తమ ప్రభుత్వానికి తెలియదన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తమకు ఎన్ని ఆస్తులున్నాయి? కేసీఆర్‌కు ఎన్ని ఆస్తులున్నాయి? ఉద్యమంలో ఎవరు ఆస్తులను పోగొట్టుకున్నారు? ఎవరు ఆస్తులను పోగేసుకున్నారు? అనే అంశంపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తాను టీఆర్ఎస్కు రాజీనామా చేసి వెళ్లిపోలేదనీ, కేసీఆరే తనను పార్టీ వీడేలా చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగిస్తే శిలాఫలకాలను పగలగొడతామన్నారు.