Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టే అవకాశముందని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ తెలిపారు. ఈ మేరకు అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాలంటూ గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి సర్వేశ్వర్‌రెడ్డిని గురువారం వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. త్వరలోనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేస్తామనీ, అందుకవసరమైన శాఖాపరమైన నిర్ణయాలు తీసుకున్నామని హామీ ఇచ్చారని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలోని అన్ని ఖాళీలను ప్రకటించి నింపాలని కోరారు. బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏండ్లలోపు వయసున్న పురుష ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ చేయాల్సి వస్తే ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని సూచించారు. రవాణా సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బదిలీల్లో అదనపు (హెచ్అర్ఏ) పాయింట్లు కేటాయించాలని కోరారు. దీనిపై సర్వేశ్వర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.