Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే యత్నం
- సంక్షేమానికి నిధుల తగ్గింపు
- సీఐటీయూ ఆన్లైన్ సభలో ప్రొఫెసర్ పాపారావు, ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు కోతల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందనీ, దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించే దిశగా బడ్జెట్ లేదని ఆర్థికవిశ్లేషకులు, ప్రొఫెసర్ పాపారావు, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు టి.రాజారెడ్డి అధ్యక్షతన 2023-24 కేంద్ర బడ్జెట్ సీపీఎస్‌యూ భవితవ్యం అనే అంశంపై ఆన్లైన్ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ..మోడీ సర్కారు సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులను తగ్గించిందని విమర్శించారు. దీంతో సమాజంలో అంతరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులను తగ్గించిందనీ, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే ప్రయత్నాన్ని ఏమాత్రం చేయలేదని విమర్శించారు. రైల్వేలు, పోర్టులను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నాలను మరింత తీవ్రం చేసిందని తెలిపారు. ఎల్ఐసీ, బ్యాంకులను నిలువునా ముంచేసిన అదానిని కాపాడే యత్నంలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. ఓవైపు కార్పొరేట్ల అనుకూల విధానాలను తీవ్రరూపం చేస్తూ మరోవైపు జాతీయవాదం ముసుగుతో దేశ ప్రజలను, యువతను బీజేపీ రెచ్చగొడుతున్న తీరును ఎండగట్టారు. వాస్తవానికి బీజేపీ విధానాలతో ఎక్కువ నష్టపోతున్నది పేద, మధ్యతరగతి ప్రజలేనని చెప్పారు. కొత్తపన్ను విధానం లాభాల కంటే నష్టాలను ఎక్కువ చేసేలా ఉందని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌ను ఎక్కడా పట్టించుకోలేదన్నారు. ఎంప్లాయిమెంట్ సృష్టి ప్రస్తావనే లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడకపోగా వాటని మరింత నిర్వీర్యం చేసే దిశగా మోడీ సర్కారు వెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించబోతున్నాయని హెచ్చరించారు. ప్రజల దగ్గర పొదుపు లేకుండా చేసే పనికి మోడీ సర్కారు పూనుకున్నట్టు ఈ బడ్జెట్ ద్వారా అర్థం అవుతున్నదన్నారు. ఆర్థిక విశ్లేషకులు, ప్రొఫెసర్ పాపారావు మాట్లాడుతూ.. ప్రజలు తాము దాచుకున్న సొమ్మును షేర్మార్కెట్లలో పెట్టేందుకు ప్రోత్సహిస్తోందన్నారు. బంగారం కొనకుండా, డబ్బులను పొదుపు చేసుకోకుండా పేకాటలాగున్న షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టేలా చేసే ఎత్తుగడలో భాగంగానే డీమానిటైజేషన్ చేసిందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షభాలన్నీ కలిసి ఓ పెద్ద సంక్షోభం వచ్చిందనీ, పెట్టుబడి దారీ వ్యవస్థపై అది తీవ్రస్థాయిలో ముట్టడిస్తున్నదని చెప్పారు. బడ్జెట్ అంటే అంకెలు, సంఖ్యలు కాదనీ, అదొక రాజకీయమని అన్నారు. ఉన్న వనరులేంటి? ప్రాధాన్యత అంశం ఏమిటి? ఎంత కేటాయించాలి? అనేది కీలకమన్నారు. అక్కడే వర్గదృక్పథం బయటపడుతుందన్నారు. మోడీ సర్కారు కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. పెట్టుబడిదారీ వ్యవస్థను నిలబెట్టే తోలు బొమ్మలాటలో మోడీ సర్కారు ఒకటని చెప్పారు. ధనికులకు మేలు చేయడం, పేదలను బానిసలుగా ఉంచడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోనే దాగి ఉందని విమర్శించారు. అంతర్జాతీయ పెట్టుబడి దారుల ఒత్తిడి మేరకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఉందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, బి.మధు హైదరాబాద్ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జె.రాఘవరావు పాల్గొన్నారు.