Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే నిజమైన జాతీయీకరణ : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-ఓయూ
సీఎం కేసీఆర్ అన్నట్టు రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను, అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడమే నిజమైన జాతీయీకరణ అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హల్లో గురువారం తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 'మీ సమస్యలు తీరే వరకు' అండగా ఉంటామన్నారు. శాతవాహన యూనివర్సిటీలో తొలగించిన ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులపై చిన్నచూపు వద్దన్నారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సమాన పనికి సమాన వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఔట ఉపాధ్యక్షులు, యూజీసీ డీన్ ప్రొ.జి.మల్లేష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు అన్ని రకాలుగా తమతోపాటు సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా అన్ని అర్హతలు వారికి కల్పించాలని కోరారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దినావస్థలో ఉందన్నారు. ఓయూలో కాంట్రాక్టు అధ్యాపకులకు కూడా ఎన్నికలు నిర్వహించాలని, ఔట అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాపరిరక్షణ సమితి కన్వీనర్ డా.అందే సత్యం మాట్లాడుతూ.. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్క రించాలన్నారు. విద్యుత్, ఆర్టీసీ రంగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పోరాటాలకు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వడంతో.. వారిని రెగ్యులరైజ్ చేసినట్టు గుర్తు చేశారు.
పట్టుదలతో, అకుంఠిత దీక్షతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమస్యలపై పదేపదే వీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్లాలని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ.. జేఎల్డీఎల్ పాలిటెక్నిక్ అధ్యాపకులకు ఎలాగైతే రెగ్యులరైజ్ చేస్తున్నారో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రామేశ్వర రావు అధ్యక్షత వహించగా.. డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్, డాక్టర్ వెంకటే శ్వర్లు, డాక్టర్ దత్త హరి, డాక్టర్ ఆర్డీ ప్రసాద్, డాక్టర్ సతీష్ చందూలాల్, శశిధర్, డాక్టర్ నారాయణ, డాక్టర్ సోమేశ్, డాక్టర్ హరీష్, డాక్టర్ నాగేశ్వరరావు, 11 యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.