Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో దరఖాస్తుకు నేడే చివరితేది : టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-4 రాతపరీక్షల తేదీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఖరారు చేసింది. జులై ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జులై ఒకటో తేదీన ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రూప్-4 పరీక్షకు ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 9,15,872 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించామని పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఓఎంఆర్ విధానంలోనే ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టు ల భర్తీ కోసం డిసెంబర్ 30న నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో దరఖాస్తు చేసే గడువు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఇతర వివరాలకు https://www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
అభ్యర్థుల్లో ఆందోళన
జులై ఒకటో తేదీన శనివారం కావడంతో గ్రూప్-4 రాతపరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వ సెలవు దినం కాకపోవడంతో పరీక్ష రాసేదెలా?అంటూ టీఎస్పీఎస్సీని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఈ పరీక్షను నిర్వహించే అవకాశమున్నది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈ పరీక్ష ఉంటుంది. అయితే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందా? లేదా?అన్న దానిపై స్పష్టత లేదు. గ్రూప్-4 పరీక్ష తేదీని మార్చాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. అయితే జులై రెండో తేదీన ఆదివారం యూపీఎస్సీ పరీక్ష ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించడం గమనార్హం.