Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ మాటలలో నక్కకు నాగలోకానికి తేడా
- బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు సమరశీల పోరాటాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - నల్లగొండ
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ పేదరికాన్ని రూపుమాపేదిగా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. వ్యవసాయంలో సంక్షోభాన్ని నివారించే విధంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. మోడీ మాటలు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల రుణమాఫీకి రూ.11లక్షల కోట్లను మంజూరు చేయగలిగింది కానీ, రైతుల సంక్షేమం కోసం నాలుగు లక్షల కోట్లను కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. గత బడ్జెట్‌కు ఈ బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే.. వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ.28 వేల కోట్లు, ఎరువుల సబ్సిడీలో రూ.50వేల కోట్లకు కోతలు విధించారన్నారు. పంటల బీమా పథకానికి 12 శాతం, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి 13 శాతం కేటాయింపుల్లో తగ్గించారన్నారు. విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని, పంటకు కనీస మద్దతు ధర, క్రాప్ ఇన్సూరెన్స్‌కు కేటాయింపులు లేవన్నారు. పేద, మధ్యతరగతికి ఏమాత్రం ప్రయోజనం లేదని విమర్శించారు. కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం రైతులు ఉద్యమిస్తున్న తరుణంలో బడ్జెట్లో ఆ ప్రస్తావని లేదని వాపోయారు. ప్రధాని మోడీ రైతాంగ ద్రోహిగా ఎప్పటికీ మిగిలిపోతారన్నారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చే కుట్ర చేస్తున్నారన్నారు. మోడీకి నిజాయితీ ఉంటే ఇప్పటికైనా అదానీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను గణనీయంగా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల్లో కేంద్రం 42శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని 41 శాతానికి తగ్గించిందన్నారు. తెలంగాణకు కేవలం 2.133 శాతం మాత్రమే తిరిగి వస్తోందని.. అది కూడా సకాలంలో కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నదులపై కేంద్రం బోర్డులు వేసి, తన ఆధీనంలోకి తీసుకుందని ఆరోపించారు. మంజూరు చేసిన రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు తగ్గిందని, దశాబ్దాల తరబడి మంజూరైన కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్టు ఈ బడ్జెట్లో స్పష్టమైందన్నారు. 2022-23లో ఉపాధి హామీ చట్టానికి రూ.89,400 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో రూ.60,000 కోట్లకే పరిమితం చేశార న్నారు. ఆహార సబ్సిడీ, గ్యాస్‌పై సబ్సిడీని కూడా తగ్గించారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి ఒక్కరూ సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.