Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన హాస్టల్ వర్కర్ల వేతనాల కోసం శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తా : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ - అడిక్ మెట్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన హాస్టల్ వర్కర్ల వేతనాల కోసం శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన నిరాహార దీక్షలో నర్సిరెడ్డి మాట్లాడారు. 39 నెలలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడం దురదృష్టకరమని, అత్యంత చిన్న స్థాయి కార్మికులు, ఆదివాసీ గిరిజనులు శ్రమ చేసినా వేతనాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలకు సంబంధించి ఆర్థిక శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రూ.9 కోట్ల 15 లక్షల చెక్కుకు వెంటనే క్లియరెన్స్ ఇచ్చి కార్మికులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డైలీ వేజ్ కార్మికులకు సంబంధించిన రూ.13 కోట్ల 65 లక్షల వేతనాల బడ్జెట్‌పై ఆర్థిక శాఖ విధించిన ఫ్రీజింగ్ ఎత్తివేయాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన కార్మికులను నియమించాల్సిన గిరిజన విద్యాశాఖలో డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ పేరుతో నియమించడం అన్యాయమని, అలాంటిది వారి వేతనాలు పెండింగ్ పెట్టడం దారుణమన్నారు. వీరందరికీ చట్టబద్ధమైన సౌకర్యాలను కల్పించాలని కోరారు. పర్మినెంట్ చేయడంతో పాటు నెలనెలా వేతనాలు చెల్లించే విధంగా శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. కార్మికుల పోరాటానికి అండగా ఉంటానన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లా డుతూ.. గిరిజన కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపటం తగదని, హాస్టల్ వర్కర్స్అందరికీ లాక్డౌన్ కాలానికి పూర్తిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 212ను, జీవో నెంబర్ 16ను సవరించి హాస్టల్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని కోరారు. హాస్టల్ వర్కర్లను మాత్రం 39 నెలలుగా పస్తులు ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫామ్ బట్టలు, గుర్తింపు కార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే మార్చిలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ప్రసంగించారు. కార్మికులు సమ్మె చేయడం మూలంగా విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే గిరిజన సంక్షేమ శాఖ విద్యార్థులం దరినీ పోరాటాల్లోకి తీసుకొస్తామని హెచ్చరించారు. గిరిజన కార్మికులకు ఉపాధ్యాయులు అండగా ఉంటారని చెప్పారు. నిరాహార దీక్షకు హాస్టల్ డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు నాయకత్వం వహించారు. వర్కింగ్ ప్రెసి డెంట్ సురేందర్, వివిధ జిల్లాల నాయకులు హిరా లాల్, పద్మ, సంగ్యా నాయక్, రవి, సుమిత్ర, నిలయ్య, అనురాధ, అనిత భారు, లక్ష్మణ్ నాయక్, యూటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య దీక్షలో ఉన్న నాయ కులకు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మచారి, రాజేందర్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ అధ్యక్షులు లెనిన్, హాస్టల్ వర్కర్స్ నాయకులు జోడి లక్ష్మి, రమేష్, బాబు సింగ్, ఇ.పద్మ , వివిధ జిల్లాల నుంచి హాస్టల్ వర్కర్లు పాల్గొన్నారు.