Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం సమావేశంలో సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలకు చేరువగా పాలనను తీసుకెళ్తున్నామనీ, తెలంగాణ చిన్నరాష్ట్రమైనప్పటికీ వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందంతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. వేసవిలోనూ పరిశ్రమలకు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. తద్వారా, వ్యవసాయంలో అద్వితీయమైన పురోగతి సాధించామనీ, ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయ వృద్ధి సాధించామని వివరించారు. రాష్ట్రంలో 2014 లో 5.05 లక్షల కోట్ల రూపాయలున్న జీఎస్డీపీ 2022 -2023 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. అదేవిధంగా రూ.1 .24 లక్షలు ఉన్న తలసరి ఆదాయం రూ 3 .17 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను విభజించామని తెలిపారు. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం తాగునీటి సమస్యను తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడంలోనూ దోహదపడిందని తెలిపారు. ఆరోగ్య రంగంలో వివిధ అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటన్నారు. హరితహారం ద్వారా 7.7 శాతానికి పచ్చదనం పెరిగిందని తెలిపారు. ఎన్డీసీ ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి ప్రియాంక్ భారతి నేతత్వంలోని బృందసభ్యులు మాట్లాడుతూ.. పథకాల ద్వారా అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు సాధికారత కల్పించడంతోపాటు టి-హబ్, ఇతర కార్యక్రమాల ద్వారా సాంకేతికతను వినియోగించుకోవడం అభినంద నీయమన్నారు. ఈ సందర్బంగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇతర ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను వివరించారు.