Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం
- మల్లిఖార్జున్‌పై కేసును ఎత్తివేయాలి
- ప్రభుత్వం స్పందించాలి :యూఎస్పీసీి ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాదుల మూక దాడులను అరికట్టాలనీ, లేదంటే భావ ప్రకటనా స్వేచ్ఛకే భంగం వాటిల్లే అవకాశముందని యుఎస్పీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం మల్లికార్జున్‌పై జరిగిన మతోన్మాద మూక దాడికి వ్యతిరేకంగా గురువారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యం లో మహాధర్నా జరిగింది. యుఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, ఎం సోమయ్య, కె భిక్షపతి, బి కొండయ్య అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎ నర్సిరెడ్డి మాట్లాడుతూ.... భారత రాజ్యాంగం ప్రకారం, దాని విలువల ప్రకారం చదువు చెప్పాల్నా వద్దా? చదువు చెప్పేవారిపై కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు మూక దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉండటం సరైంది కాదని చెప్పారు. ఇదే కొనసాగితే ప్రభుత్వ మనుగడకు కూడా ప్రమాదమేనని హెచ్చరించారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, శాస్త్రీయ దృక్పథాన్ని సహించలేని మతోన్మాద శక్తులు చెలరేగి పోవడాన్ని ప్రతిఘటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, సామాజిక , విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ రాజకీయాలు మతపరం కాకుండా ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ పరంగా ప్రజల .సామాజిక, ఆర్థిక, అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యానికి , సమానత్వానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. వీటన్నింటి వెనుక సంఫ్‌ు పరివార్ శక్తులు ఉన్నాయని చెప్పారు. మల్లికార్జున్ పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బడుల్లోకి విధ్వంసకర శక్తుల చొరబాటు అనేది రాజ్య యంత్రాంగ వైఫల్యమే కాకుండా పరోక్షంగా వారికి సహకరించడమేనని అభిప్రాయ పడ్డారు. మతాన్ని నమ్మే స్వేచ్ఛ ఉన్నట్లే.. నమ్మకుండా ఉండే హక్కు కూడా అంతే ఉందన్నారు. శాస్త్రీయంగా బోధన చేసే ప్రజా స్వామిక వాతా వరణం కోసం పోరాడాలన్నారు. అకడమిక్ స్వేచ్ఛ లేని ఉపాధ్యాయ వృత్తికి అర్థం లేదనీ, దానికోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ధర్నాలో బాధిత ఉపాధ్యాయుడు ఎం మల్లికార్జున్, స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ టి రమేష్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, ప్రొ చక్రధర్ రావు, ప్రొ కాశిం, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, నాస్తిక సంఘం అధ్యక్షులు జీడి సారయ్య, కుల నిర్మూలనా సంఘం నాయకురాలు గుత్తా జోశ్న, కేపీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, పీఓడబ్ల్యు అధ్యక్షులు జి ఝాన్సీ , స్వరూప,స్వేచ్ఛ జేఏసీ నాయకులు హన్మంతరావు, జనార్దన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మహేష్, రామకృష్ణ, ప్రదీప్, యుఎస్పీఎస్సి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎం రవీందర్, టి లింగారెడ్డి, వై విజయకుమార్, ఎస్ మహేష్, పి మాణిక్ రెడ్డి, ఎం రఘుశంకర్ రెడ్డి, పి నాగిరెడ్డి పాల్గొన్నారు.