Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఆర్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
- పాశ్చాత్య దేశాల్లో 65 శాతం మందికి శిక్షణ పూర్తి
- మన దేశంలో రెండు శాతమే...: గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వారికి తక్షణం కార్డియో పల్మనరీ రెససీటేషన్ (సీపీఆర్) ప్రక్రియతో బతికించవచ్చని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్ స్కూల్ సమీపంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్, గాంధీ మెడికల్ కాలేజ్ అలుమ్ని అసోసియేషన్ సంయుక్తాధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె సీపీఆర్ శిక్షణను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీపీఆర్ ప్రాముఖ్యత తనకు తెలుసు గనుకే....తీరిక లేకుండా ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకుని వచ్చానని తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో 65 శాతం మంది ప్రజలు సీపీఆర్ ప్రక్రియలో శిక్షణ పొంది ఉన్నారనీ, మన దేశంలో ఇప్పటికీ రెండు శాతం మంది మాత్రమే ఈ శిక్షణ తీసుకున్న వారున్నారన్నారు. సీపీఆర్ ప్రక్రియ శిక్షణలో చాలా వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ ప్రక్రియ సంక్లిష్టమైనదేమి కాదనీ, సామాన్యులు కూడా నేర్చు కోవచ్చని చెప్పారు. తాను విమాన, రైలు ప్రయాణాల్లో ఉన్న సమయం లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారిని కాపాడిన ఉదంతాలను ఆమె చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియపై నేర్చుకోవడం ద్వారా అకస్మాత్తుగా గుండె పని చేయడం ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్) అయిన వారిని కాపాడే అవకాశముంటుందని వివరించారు. సాటి మనుష్యులను జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రేమిస్తూ, సంరక్షించే అలవాటు చేసుకోవాలని సూచించారు.
అలుమ్ని అసోసియేషన్ల బలోపేతం
యూనివర్సిటీల వారీగా అలుమ్ని (పూర్వ విద్యార్థుల) అసోసియేషన్లను బలోపేతం చేస్తున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ పనిని రెండేండ్ల క్రితమే ప్రారంభించినట్టు చెప్పారు. అలుమ్ని వివరాలు తెలపాలని యూనివర్సిటీలను కోరితే వాటి వద్ద ఆ సమాచారం సంపూర్ణంగా లేదని చెప్పారు. మద్రాస్ మెడికల్ కాలేజీ తదితర కాలేజీల పూర్వ విద్యార్థిగా అక్కడ అలుమ్ని అసోసియేషన్‌తో కలిసి తాము ఎన్నో ఉపయోగకరమైన పనులు చేశామని తెలిపారు. ఆ అనుభవంతో తెలంగాణలోనూ అలుమ్ని అసోసియేషన్లను ఏర్పాటు చేసి, సమాజా నికి ఉపయోగపడే పనులు చేయాలనేది తన ఉద్దేశమని వివరించారు. యూనివర్సిటీలు వివరాలు తెలపకపోవడంతో తాను రాజకీయ నాయకులు చదువులను బట్టి వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులనిస్తూ అలుమ్ని అసోసియేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ప్రభుత్వానికి సూచనలు
సీపీఆర్ ప్రక్రియను ప్రతి విద్యార్థి నేర్చుకునేలా తప్పనిసరి చేయాలని తాను ప్రభుత్వానికి సూచి స్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. అంతకు ముందు గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లింగమూర్తి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింగ్ రావు, అసోసయేషన్ సలహాదారు డాక్టర్ చంద్రశేఖర్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ట్రైనర్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు ప్రతి మెడికల్ కాలేజీలో సీపీఆర్ శిక్షణ పెట్టేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.
సీపీఆర్ డెమో
ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ సీపీఆర్ ప్రక్రియను ఎలా నిర్వహించాలో, ఛాతి మర్థన ఎలా చేయాలో డాక్టర్ రాజశేఖర్ వివరించారు. గవర్నర్ తమిళిసై డెమోలో కొంత సేపుండి తాను కూడా సీపీఆర్ ప్రక్రియను నిర్వహించి చూపించారు. అసోసియేషన్ పక్షాన గుండె ఆగిపోయిన సందర్భంలో ఉపయోగించాల్సిన ఎఇడీ మిషన్ ను గవర్నర్‌కు బహుకరించారు. ప్రజలు ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లో ఈ మిషన్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
4,280 మంది మరణం
దేశంలో ప్రతి ఏడాది లక్ష జనాభాలో 4,280 మంది అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం ద్వారా ప్రాణాలొది లేస్తున్నారని డాక్టర్లు వివరించారు. వీరిని కాపాడేందుకు ప్రభుత్వాలు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.