Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హై లెవెల్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ- సిటీబ్యూరో
టాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలని, హై లెవల్ కమిటీ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్డులోని సీపీఐ(ఎం) కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం 2019లో వేసిన హై లెవెల్ కమిటీ నాలుగు నెలల కిందట ప్రభుత్వానికి నివేదిక అందించిందని తెలిపారు. టాలీవుడ్లో మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని నిర్ధారిస్తూ.. నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సిఫారసులు చేసిందని గుర్తుచేశారు. దీనిపై నేటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. అసంఘటితరంగ కార్మికుల్లో ఒంటరి మహిళా ఆర్టిస్టులు దళారుల చేతుల్లో తీవ్రమైన లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వీరికి వేతనాలూ సక్రమంగా చెల్లించడం లేదని కమిటీ గుర్తించిందని తెలిపారు. సినీ పరిశ్రమలో దళారుల దాష్టీకాలు ఎక్కువగా ఉన్నాయని, వీరిని నియంత్రించే యంత్రాంగం లేదని కమిటీ భావించిందన్నారు. ఆడిషన్స్‌లో లైంగిక వేధింపులకు గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని, డాన్స్ స్కూల్స్‌పై నియంత్రణ లేదని, అర్ధరాత్రులు షూటింగ్‌లు జరిగినా మహిళా ఆర్టిస్టులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదని కమిటీ గమనించిందని వివరించారు.
లైంగిక వేధింపులపై అంతర్గత కమిటీ వేయాలని సినీ పరిశ్రమ పెద్దలు 2018లోనే నిర్ణయించుకున్నా నేటికీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైలెవెల్ కమిటీ వేసిన తర్వాత కూడా టాలీవుడ్లో పరిస్థితులు మారలేదని, ఇటీవల అనేక సంఘటనలు జరిగినప్పటికీ అవి బయటకు రావడం లేదని తెలిపారు.
టాలీవుడ్లో ఫిల్మ్ చాంబర్, అన్ని ఫెడరేషన్స్, యూనియన్లు ప్రొడక్షన్ కంపెనీలలో అంతర్గత కమిటీలు వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున మానిటరింగ్ కమిటీ వేయాలని హై లెవెల్ కమిటీ ప్రధానమైన సిఫారసు చేసిందన్నారు. ఈ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, మానిటరింగ్ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) తరపున డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.మహేందర్, అంబర్‌పేట జోన్ కమిటీ సభ్యులు వై.వరలక్ష్మి ఉన్నారు.