Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజ మార్పు కోరేవారి ఆలోచనలకు వెన్నుపోటు
- అవినీతిలో కూరుకుపోవడం ప్రజలను మోసం చేయడమే : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లిక్కర్ కుంభకోణంలో కూరుకుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు ఆ కేసులో ఉన్న అందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'అవినీతికి వ్యతిరేకంగా సమాజంతోపాటు ప్రభుత్వ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ దేశంలో ఉన్నటువంటి ఆనేక మంది యువతీ, యువకులను, ముఖ్యంగా గాంధేయవాదులను మోసం చేశారని విమర్శించారు. అవినీతి లేని సమాజ నిర్మాణం చేస్తానంటూ ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇంత మందిని మోసం చేశారని ఆరోపించారు. అవినీతిలో మునిగి తేలితే ఇంత కంటే ప్రమాదకరమైన విషయం ఇంకొకటి ఉండదని' తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశ మార్పుకు ఆలోచన చేసే అనేక మంది ఆలోచనలకు వెన్ను పోటు పొడిచారని ఎద్దేవా చేశారు. దేశానికి, సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేజ్రీవాల్‌పై ఉన్నదని అన్నారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది పేర్లు వినిపిస్తున్నందున వారే కాకుండా, ఎంతటి వారు ఉన్నా ప్రభుత్వం ఉపేక్షించకూడదని చెప్పారు.