Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కోసం నిధులు కేటాయించాలని ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపు మేరకు. ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు మహిళలు కదిలి రావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన ఐద్వా సంఘం ఆఫీసుబేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామంటూ, స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలిస్తామంటూ ఎనిమిదేండ్లుగా చెబుతున్నారనీ, ఆచరణలో హామీలు అమలు కావటం లేదని తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఇండ్లకోసం ధరాఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జనవరి నుంచి రాష్ట్ర వ్యాపితంగా గ్రామాలు, పట్టణాల్లో సర్వే నిర్వహించామని తెలిపారు. లబ్దిదారులతో మూడో తేదీన మండల కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో ఐద్వా సీనియర్ నాయకులు టి. జ్యోతి, బి. హైమవతి, కె. ఆశలత, బి.సరళ, డి. ఇందిర, ఎమ్. భారతి, ఎమ్. లక్ష్మమ్మ, కె. నాగలక్ష్మి, పి. శశికళ తదితరులు పాల్గొన్నారు.