Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొందరగా క్రమబద్ధీకరణ చేపట్టాలి :
కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అసెంబ్లీలో 'కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించే ప్రక్రియ కొనసాగుతున్నది' అని ప్రసంగించడాన్ని ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్ జీసీసీఎల్ఏ-475) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల బాధలను చూసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరణ కోసం 2016లో జీవో నెంబర్ 16ను జారీ చేశారని వివరించారు. ఇప్పటి వరకు వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖలో మెజార్టీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు ఏ ఒక్కరు కూడా క్రమబద్ధీకరణ కాలేదని తెలిపారు.
ఈ మధ్యకాలంలో గత అసెంబ్లీ సమావేశంలోనే 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాకపోవడం వల్ల కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వెంటనే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసి దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగుల వెట్టిచాకిరీ విధానాన్ని రూపుమాపటానికి మార్గం చూపెట్టాలని కోరారు.