Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.12,800 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2014 వరకు కేవలం రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. త్వరలో వందే మెట్రోలు కూడా రాబోతున్నాయని తెలిపారు. 60-70 కి.మీ ఉన్న రెండు పట్టణాల మధ్య వందే మెట్రో నడుపుతామనీ, వందే భారత్ రైలుకు భిన్నంగా ఇది ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే వందే మెట్రోను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకరించాలని కోరారు. హై స్పీడ్ రైళ్లపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామనీ, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.
కోచ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే దేశంలో చాలా ఉన్నాయన్న అశ్విని వైష్ణవ్.. విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫీజుబులిటిని పరిశీలించాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు కేటాయించామన్నారు. కేంద్రం చేయాల్సింది చేస్తుందని.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని వెల్లడించారు.
గతేడాది కన్నా 45 శాతం పెంపు : దక్షిణమధ్య రైల్వే జీఎం
గత బడ్జెట్ కంటే ఈసారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 45 శాతం బడ్జెట్ పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రూ.600 కోట్లు డబ్లింగ్, త్రిబ్లింగ్ పనులకోసం కేటాయించారని వివరించారు. రూ.450 కోట్లు కాజిపేట- బల్లార్షా మార్గంలో థర్డ్ లైన్ పనులకోసం, అకొల- డోన్ మార్గంలో డబ్లింగ్ కోసం రూ.60 కోట్లు, కాజీపేట- విజయవాడ థర్డ్ లైన్ పనుల కోసం రూ.377 కోట్లు, బైపాస్ లైన్ల కోసం రూ.383.12 కోట్లు, చర్లపల్లి టెర్మినల్ పనుల కోసం రూ.82 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనుల కోసం రూ.600 కోట్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ.125 కోట్లు వెచ్చించినట్టు పేర్కొన్నారు.