Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఐని ఎత్తివేసే యోచనలో కేంద్రం
- తాజా బడ్జెట్లో కేవలం రూ.లక్ష కేటాయింపు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా పత్తి సాగు
- ప్రభుత్వ సంస్థ లేకపోతే ప్రయివేటు వ్యాపారులు చెప్పిందే ధర
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఇప్పటికే ధర లేక బయట అమ్ముకోలేక ఇండ్లల్లోనే పంటను నిల్వ చేసుకుని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పత్తి రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్న ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని కేంద్రం ఎత్తివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజా బడ్జెట్లో ఈ సంస్థకు కేవలం రూ.లక్ష నిధులు కేటాయింపులు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇన్నాండ్లు కొనుగోళ్లలో ప్రభుత్వరంగ సంస్థ ఉందనే భరోసాతో ఉన్న పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం దిక్కుతోచని స్థితిని కల్పించేలా మారింది. ముఖ్యంగా పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ వాసులకు మరింత ఇబ్బందులు ఎదురు కానున్నాయి. కిందటేడాది బడ్జెట్లో సీసీఐ సంస్థకు రూ.9247కోట్లు కేటాయించిన కేంద్రం.. తాజా 2023-24 బడ్జెట్లో కేవలం రూ.లక్ష కేటాయించడంతో సంస్థ మనుగడ కొనసాగడం కష్టమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ప్రయివేటు వ్యాపారులు చెప్పిందే ధర ఉండే ప్రమాదం ఉంది.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐది ప్రత్యేక పాత్ర. ప్రతి ఏటా రైతుల నుంచి కొనుగోళ్లు చేస్తూ వారికి వెన్నుదన్నుగా ఉండేది. కరోనా కాలం నుంచి పత్తి కొనుగోళ్లను చేపట్టడం లేదు. తాజాగా 2022-23ఏడాదిలోనూ పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో ప్రయివేటు వ్యాపారులదే పైచేయి కావడం.. వారి ఇష్టం వచ్చినట్టు ధరలో కోత విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో సీసీఐ వాణిజ్య పరంగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు, వివిధ రైతుల సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తడంతో దిగొచ్చిన సదరు సంస్థ 2022-23 ఏడాదిలో వాణిజ్య కొనుగోళ్లలో దిగింది. కానీ ప్రయివేటు వ్యాపారుల కంటే తక్కువ ధర నిర్ణయించడంతో రైతులెవరూ ఈ సంస్థకు పత్తిని విక్రయించలేదు. దీంతో ఈ వార్షిక ఏడాదిలో సీసీఐ కనీసం కిలో పత్తి కూడా కొనుగోలు చేయలేదు. రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రైతుచట్టాలను రద్దు చేసినప్పటికీ చట్టాల్లో పేర్కొన్న విధానాలనే పరోక్షంగా అమలు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోటీపడి కొనుగోలు చేసిన సీసీఐ
ఆదిలాబాద్ పేరు చెప్పగానే ముందుగా పత్తి మార్కెట్ గుర్తుకొస్తుంది. ఆసియాలోనే నాణ్యమైన పత్తి ఇక్కడ లభిస్తుందనే పేరు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఈ సంస్థ ప్రయివేటు వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 2014-15 ఏడాదిలో సీసీఐ 54,76,789 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా ప్రయివేటు వ్యాపారులు 17,10,57 పత్తిని కొనుగోలు చేశారు. 2015-16ఏడాదిలో సీసీఐ 8,06,297 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా.. ప్రయివేటు వ్యాపారులు సీసీఐ కంటే అదనంగా 29,11,045 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. 2016-17లో మాత్రం కొనుగోలు చేయలేదు. అనంతరం 2017-18ఏడాదిలో 34,629వేల క్వింటాళ్లు, 2018-19లో 3,35,510లక్షల క్వింటాళ్లు, 2019-20ఏడాదిలో 26,33,327లక్షల క్వింటాళ్లు, 2020-21లో 22,15,726లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. 2022-23 ఏడాదిలో వాణిజ్య కొనుగోళ్లలో దిగినప్పటికీ ప్రయివేటు వ్యాపారుల కంటే తక్కువ ధర నిర్ణయించి కొనుగోళ్లకు దూరంగా ఉంది.
జూట్ కార్పొరేషన్లో విలీనం చేసే యోచన..!
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ఈ సంస్థ కొనసాగడం అనుమానంగా మారుతోంది. ఈ సంస్థను జూట్ కార్పొరేషన్(జాతీయ జనపనార సంస్థ)లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏటా కేంద్రం పంటలకు మద్దతు ధరలు నిర్ణయిస్తుంది. ఈ ఏడాది పత్తికి క్వింటాల్‌కు రూ.6380గా నిర్ణయించగా.. ప్రయివేటు వ్యాపారులు రూ.7500 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేయకపోతే సీసీఐ కొనుగోలు చేస్తుంది కనుక ప్రయివేటు వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి కొనుగోలు చేశారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ అనేది రంగంలో లేకపోతే భవిష్యత్తులో వ్యాపారులు నిర్ణయించినదే ధరగా మారే అవకాశాలుంటాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ లేకపోతే కనీసం మద్దతు ధర కూడా వచ్చే అవకాశం ఉండదని కలవరపడుతున్నారు.
సీసీఐకి నిధులు
కేటాయించకపోవడం శోచనీయం
ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు కేంద్రం బడ్జెట్లో కేవలం రూ.లక్ష కేటాయించడం శోచనీయం. ఈ సంస్థను పూర్తిగా ఎత్తివేసే కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే జరిగితే రైతులు రానున్న రోజుల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పత్తి పంట కొనుగోళ్లకు ప్రభుత్వ భరోసా లేకుండాపోతుంది. భవిష్యత్తులో మద్దతు ధర కూడా రాలేని పరిస్థితి ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది.
బండి దత్తాత్రి- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు