Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు ప్రగతి మాత్రమే ప్రస్తావన
- కేంద్రంపై పల్లెత్తు మాటా లేదు
- రావల్సిన నిధుల వాటాపైనా నో కామెంట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ సమావేశాల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభోపన్యాసం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధి అంశాలను మాత్రమే గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయంగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, ఆ వేడిని గవర్నర్ ప్రసంగంలో చూపించలేదు. కనీసం కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద రాష్ట్రానికి రావల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదు. అంతకుముందు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శానసమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు సాదరంగా స్వాగతం పలుకుతూ, సభలోకి తోడ్కొని వచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని ప్రభుత్వం భావించడం, ముసాయిదా బడ్జెట్‌కు గవర్నర్ తమిళసై ఆమోదం తెలుపకపోవడం, దీనిపై ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం, కోర్టు ఆదేశాలతో రాజీ కుదిరి, చివరకు గవర్నర్‌కు ప్రసంగ పాఠాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి అందించడం వంటి వరుస సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగపాఠాన్ని చదువుతారా? కేంద్రంపై విమర్శలు ఉంటే ఎలా స్పందిస్తారు? లేక సొంత ప్రసంగ పాఠం చదువుతారా? అనే అంశాలపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీనిపై చర్చించుకున్నారు. గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన 20 పేజీల ప్రసంగం పాఠాన్ని చదువుతున్నంత సేపూ ప్రజా ప్రతినిధులంతా దానిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ కనిపించారు. మీడియా గ్యాలరీలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలోని ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా గవర్నర్ పూర్తిగా చదవడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్రంపై విమర్శలు లేకుండా ప్రసంగ పాఠంలో జాగ్రత్తలు తీసుకుంది. పూర్తిగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మాత్రమే ప్రసంగంలో పొందుపర్చారు. బడ్జెట్‌కు సంబంధించిన ఎలాంటి అంశాలు ఈ ప్రసంగంలో లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తు న్నదనీ, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి పలు అవార్డులు లభించాయనీ ఆమె తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. సభకు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్సీలు కూడా గవర్నర్ ప్రసంగాన్ని ఆలకించారు. 20 పేజీల ప్రసంగ పాఠాన్ని 21 నిముషాల్లో చదివిన ఆమె 'పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది' అనే కాళోజీ నారాయణ రావు కవితతో ప్రారంభించి, 'కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపు డో...పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...' అనే దాశరధి కృష్ణమాచార్య కవితతో ముగించారు. అనంతరం సభా సంప్రదాయాల ప్రకారం ముఖ్యమంత్రి, స్పీకర్, చైర్మెన్, కార్యదర్శి గవర్నర్‌ను గౌరవంగా సాగనంపారు.