Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రఘునందన్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివద్ధికి నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు ఆరోపించారు.నియోజక వర్గాల ప్రత్యేక అభివృద్ధి పథకం కింద గజ్వేల్‌కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790కోట్ల నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రగతి భవన్ ముందు ఓ సర్పంచ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఇంటి నిర్మాణానికి గతంలో రూ.5లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3లక్షలకు తగ్గించిందన్నారు. 2019లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మూడేండ్లయినా ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీకి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంలేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని బద్నాం చేస్తోందనీ, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని రఘునందన్ స్పష్టం చేశారు.