Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులకూ ఇండ్ల స్థలాలివ్వాలి
- అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గవర్నర్ ప్రసంగంలో పేదలకు ఇండ్ల స్థలాల ఊసే లేకపోవటం విచార కరమని శాసన సభలో కాంగ్రెస్ సభ్యుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పేదోళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవోను మళ్ళీ తీసుకురావాలని కోరారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిధుల్లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సహాయాన్ని రూ. రెండు లక్షలు పెంచాలన్నారు. క్యాన్సర్ రోగుల సమస్యలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం ఆ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని గుర్తుచేశారు. యాదాద్రికి మెట్రో రైల్ ఏర్పాటు చేయాలనీ, సంగారెడ్డికి కూడా మెట్రోను విస్తరించాలని కోరారు. నిరుద్యోగ భతి కింద ఇస్తామన్న రూ. 3,016 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని గుర్తుచేశారు.