Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
బిల్లులు రాలేదని పాఠశాల అదనపు తరగతి గదులకు కాంట్రాక్టర్ తాళం వేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలం కానుకుంట గ్రామంలో బుధ వారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కానుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులను నిర్మించారు. సంవత్సర కాలంగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మహేందర్రెడ్డి పాఠశాల తరగతి గదులకు తాళం వేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఎండలో కూర్చునే చదువులు కొనసాగించాల్సిన దుస్థితి ఎదురైంది. ఈ విషయమై గతంలో ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తాళం వేయాల్సి వచ్చిందని కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రూ.16.40 లక్షల వ్యయంతో గదులను నిర్మించానని తెలిపారు. 2021 ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చామన్నారు. నిర్మాణం పూర్తయి సంవత్సరం దాటుతున్నా కేవలం 40 శాతం నిధులు రూ. 7 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. విద్యార్థులు ఎండలో కూర్చున్నారని ఉపాధ్యాయులు అభ్యర్థించడంతో తిరిగి తాళాలు తీసినట్టు కాంట్రాక్టర్ తెలిపారు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి వెంటనే అధికారులు బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.