Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి
- మల్లుస్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో జి.సరోజినమ్మ ఫార్మసీ ప్రారంభం
నవతెలంగాణ- కంఠేశ్వర్
పేద ప్రజల కోసం ఫార్మసీ ప్రారంభించడం అభినందనీయమని నిజామాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని హమాల్వాడీలోని ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన సరోజినమ్మ జనరిక్ ఫార్మసీని బుధవారం జడ్జి ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అధ్యక్షతన నిర్వహించిన సభలో సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి మాట్లాడారు. పేదలకు అతి తక్కువ ధరలతో నాణ్యత కలిగిన మందులు అందించడం అభినందనీయమన్నారు. పేదలంతా ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల కోసం నిస్వార్ధంగా సేవలు చేస్తున్న మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా, పోరాట మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు అందరికీ ఆదర్శం అని చెప్పారు. ఒక రిటైర్డ్ టీచర్ తన యావదాస్తిని సేవా కార్యక్రమాల కోసం సంఘానికి ఇవ్వటం అనేది ఆమె దాతృత్వానికి నిదర్శమని చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరరీ బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. డబ్బు కన్నా దాతృత్వం గొప్పదని, సరోజినమ్మ సేవ వెలకట్టలేనిది అని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో కొత్త మెళకువలను ప్రభుత్వాలు తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం మందుల ధరలు ఆకాశానికి తాకాయని, కొందరు వైద్యాన్ని వ్యాపారంగా చేసుకోవడంతో.. రోగికి సరైన వైద్యం అందక చనిపోతున్నారని అన్నారు. అదే విధంగా దేశంలో జనరిక్ మెడిసిన్స్ వాడటం పెరిగిందని చెప్పారు. మనం వాడటంతోపాటు భారత దేశం ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో 3వ స్థానానికి చేరిందన్నారు. అదేవిధంగా, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్టు.. నిజామాబాద్ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు దత్తాత్రేయరావు, కె.రామ్మోహన్రావు, ట్రస్ట్ కోశాధికారి ఈవీల్ నారాయణ, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్ రావు, మదన్మోహన్, భోజరావ్, అందే సాయిలు, సిర్ప లింగయ్య, శ్రామిక మహిళా సంఘం నాయకులు నూర్జహాన్, సబ్బని లత, జనవిజ్ఞాన వేదిక నాయకులు నర్రా రామారావు, నర్సింలు, విగేష్, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.