Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని భద్రత, బీమా సౌకర్యం కల్పించాలి : రాష్ట్ర పశుమిత్రల వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్
నవతెలంగాణ - అడిక్మెట్
పశుమిత్రలను వర్కర్లుగా గుర్తించి పనికి తగిన వేతనం ఇవ్వాలని తెలంగాణ పశుమిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ పశుమిత్రల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైందని, వ్యవసాయానికి పాడి పరిశ్రమ ఎంతో ముఖ్యమైందని అన్నారు. అటువంటి పాడి పరిశ్రమ బాగోగులు చూసే పశుమిత్రల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. పశుమిత్రలను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పశుమిత్రలు పశు పోషకులకు, పశుసంవర్ధక శాఖకు మధ్య వారధిలా పనిచేస్తూ పశువులకు వైద్య సేవలు అందేలా చూస్తున్నారన్నారు. పశుపోషణపై అవగాహన కల్పిస్తూ.. పాడి ఉత్పత్తుల మార్కెటింగ్ సమాచారం, పశువుల బీమా మొదలైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. పశువులకు వైద్యం చేస్తున్న క్రమంలో దాడులకు గురవుతున్నారని, వాటికి సోకిన వైరస్ పశుమిత్రలకు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. దేశ ఆహార ఉత్పత్తిలో రెండో భాగంగా ఉన్న పశుసంపదను పరిరక్షిస్తున్న పశుమిత్రలకు ప్రభుత్వం ఎలాంటి వేతనమూ ఇవ్వకపోవడం, పని భద్రత కల్పించకపోవడం హేయమైన చర్య అన్నారు. వెంటనే పశు మిత్రులకు గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం, యూనిఫాం, గ్లౌజులు, మాస్కులు, మందులతో కూడిన కిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పశు మిత్రలందరికీ సబ్సిడీపై ఎలక్ట్రికల్ బైకులు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో పశుమిత్రల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.శారద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి, యూనియన్ నాయకులు శ్రీలత, ఇందిరా, సంగీత, పద్మ, లలిత, నజియా, వజీర, రజిని తదితరులు పాల్గొన్నారు.