Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది కంటే రెండింతల సాగు
- రెండోస్థానంలో తెల్ల బంగారం
- మిగతా పంటలపై ఆసక్తి చూపని అన్నదాత
- ప్రభుత్వ ప్రోత్సాహకాలు, భరోసా ఏది?
- దెబ్బతింటున్న పంటల సమతుల్యత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో దారులన్నీ వరి సాగు వైపే పోతున్నాయి. గతేడాది యాసంగి సీజన్‌తో కంటే ఈసారి రెండింతల విస్తీర్ణంలో వరి సాగైంది. ఇది రికార్డు స్థాయిలో నమోదైనట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నది. ఆ తర్వాతి స్థానంలో తెల్లబంగారంగా పిలువబడుతున్న పత్తి పంటపై అన్నదాతలు మక్కువ చూపుతున్నారు. మిగతా మొక్కజొన్న, జొన్న, సజ్జ, పప్పుధాన్యాలు, మిల్లెట్స్, పండ్లు, కూరగాయల సాగువైపు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరే కారణమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కొరవడటం, మద్దతు ధరలు లేకపోవడం...మరోవైపు అడవి పందులు, కోతుల బెడద తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పంటల సమతుల్యత దెబ్బతింటున్న పరిస్థితులు నెలకొన్నాయి.
పంటల ప్రణాళిక ఏది?
రాష్ట్ర ప్రభుత్వానికి శాస్త్రీయమైన పంటల ప్రణాళిక లేదనే చెప్పవచ్చు. రాష్ట్రంలో నేల స్వభావం, ఏయే నేలల్లో ఏ పంటలు వేయాలో, ఏ పంటలకు కావాల్సిన ప్రోత్సహకాలను ఇస్తుందో ముందుగా ప్రణాళిక రూపొందించాల్సి ఉన్నది. ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2018-19లో వరి, పత్తి సాగుపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు ఆ పంటలను సాగు చేశారు. వరి, పత్తి విషయంలో యంత్రీకరణ, కలుపుతీత మిషన్లు, కలుపు మందుల వినియోగం, వాటికి ధర గ్యారంటీ ఉన్నది. పత్తి వాణిజ్య పంట కూడా కావడంతో రైతులు సాగు చేస్తున్నారు. గతంలో మొక్క జొన్నను మార్క్‌ఫెడ్ కొని పౌల్ట్రీ రైతులకు సరఫరా చేసేది. కోళ్ల దాణా
కోసం ఉపయోగిస్తున్న మొక్కజొన్నను పౌల్ట్రీ యాజమానులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో స్థానిక మొక్కజొన్నకు గిరాకీ లేకుండాపోయింది. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గతేడాది కంటే మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. దాదాపు పది లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన మొక్కజొన్న ఆరు లక్షల ఎకరాలకే పరిమితమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వరి పంట మానేయాలనీ, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ రైతులు పెద్దగా పట్టించుకోలేదు. పంటల సాగు విషయంలో ప్రణాళిక లేకుండా ప్రభుత్వం ఇష్టమెచ్చినట్టు ప్రకటనలు చేయడంతో రైతులు గందరగోళానికి గురి అవుతున్నారు.
తగ్గుతున్న చిరు, పప్పుధాన్యాల సాగు
పత్తి పంటను 75 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని చెప్పిన సర్కారు.... కందులు, శనగలు, పెసర్లు, మినుములు, ఉలవలు, బెబ్బర్లు, పల్లీ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ తదితర పంటలను ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో చెప్పడం లేదు. ఆహారంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం అసలే లేదు. వీటిని సేకరించాల్సిన మార్క్‌ఫెడ్ సంస్థ కూడా సేకరించడం లేదు. దీంతో రైతులు పండించినప్పటికీ దళారుల మోసాలకు బలి అవుతున్నారు. అధికవర్షాలకు పంట నష్టపోతే పరిహారం కూడా అందడం లేదు. ఆశించిన ధర రాకపోవడంతో పంటలు వేయడం కూడా దండగ అనుకునే పరిస్థితులు దాపురించాయి. అడవి పందులు, కోతుల దాడి ఎక్కువైయింది. వాటి బారి నుంచి ఆ పంటలను రక్షించుకునే పరిస్థితులు లేవు. అందుకే చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల పంటల సాగు క్రమంగా తగ్గిపోతున్నది. గోధుమ పంట యాసంగిలో కేవలం 8,211 ఎకరాల్లో సాగు చేశారు. జొన్న 893 ఎకరాల్లో సాగైంది. రాగి 431 ఎకరాలకే పరిమితమైంది. శనగ సాగు 3.60 ఎకరాల్లో సాగు చేసి కొంత ఊరట ఇచ్చారు. గతేడాదితో పోల్చితే మినుము సాగు సగానికి తగ్గింది. ఉలవలు, బెబ్బర్లు ఎనిమిది వేల ఎకరాల్లో సాగు చేశారు.
మిర్చి, ఉల్లి సాగు 'జీరో'
గతేడాది మిర్చి పంటకు తామర తెగులు సోకి ఊడ్చుకుపోయింది. దీంతో రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుపాలై ఈసారి ఆ పంట జోలికి పోలేదు. 4.67 లక్షల టన్నుల ఉల్లి వినియోగించాల్సి ఉన్నది. కానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో సాగే చేయడం లేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి జరుగుతోంది. పండ్లు, కూరగాయల పంటల సాగు కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఆలుగడ్డకు 46శాతం, ఆకు కూరలకు 52శాతం, ఇతర కూరగాయాలకు 11.55 శాతం కొరత ఉందని ఉద్యానవన శాఖ లెక్కలు చెబుతున్నాయి. వేరుశనగ మినహా నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ పంటల సాగు కూడా క్రమంగా తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పంట సమతుల్యతను సాధించాల్సి అవసరముందని నిపుణులు చెబుతున్నారు.