Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించాలి
- ఫాసిస్టు బీజేపీని నిలువరించడమే లక్ష్యం : ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ మహాసభలో వామపక్ష పార్టీల నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలనలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయిందనీ, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ వామపక్ష పార్టీల జాతీయ నేతలు విమర్శించారు. ధరలు, అసమానతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం పెరగడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదనీ, ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వామపక్షాల ఐక్యత ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. దేశంలో ఫాసిస్టు, మతోన్మాద బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా ముందుకు సాగాల ని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై పోరాటాలతోపాటు ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందనీ, అప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రజలు పూనుకుంటారని అన్నారు. ఫార్వర్డ్‌బ్లాక్ మహాసభలు అందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. ఈనెల 26 వరకు జరిగే అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) 19వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు సౌహార్ధ సందేశమిచ్చారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లో స్వాతంత్య్ర సమరయోధుల్లేరు : సుభాషిణీఅలీ
బీజేపీ, ఆర్ఎస్ఎస్లో స్వాతంత్య్ర సమరయోధుల్లేరని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ విమర్శించారు. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను సొంతం చేసుకునేందుకు ఆయా శక్తులు ప్రయతి స్తున్నాయని చెప్పారు. ఆయన లాల్‌సలాం, జైహింద్ నినాదమిచ్చారని అన్నారు. భారతీయు లంతా బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా, స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. జైలు నుంచి విడిచి పెట్టాలంటూ సావర్కర్ లేఖ రాయడమే అందుకు నిదర్శనమని అన్నారు. హిందూరాజ్య స్థాపన కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు శక్తులు హిందూత్వ ఎజెండాను వేగంగా అమలుచేసేందుకు కుట్రలు పన్నుతు న్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, సామాన్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుం టున్నారని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని, ప్రజాపంపిణీ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నిరీర్వం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకే వ్యవసాయ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. అన్నదాతలు వీరోచితంగా ఏడాదిపాటు పోరాడి ఆ నల్ల చట్టాలను వెనక్కి కొట్టారని అన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్షాలు ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఒకే కమ్యూనిస్టు పార్టీ ఉండాలి : నారాయణ
వివిధ పార్టీల కలయికతో పాక్షికంగానే విజయం సాధిస్తామనీ, అదే 'ఒకే కమ్యూనిస్టు పార్టీ, ఒకే డోర్, ఒకే ఫోర్స్' తోముందుకొస్తే ఏదైనా సాధించొచ్చనీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ చెప్పారు. ఫాసిజం, సామ్రాజ్యవాదం మళ్లీ పుంజుకున్నాయని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కూడిన విస్తృత కూటమిని నిర్మించడం తక్షణావసరమంటూ విజయవాడలో నిర్వహించిన తమ పార్టీ జాతీయ మహాసభలో నిర్ణయించామని గుర్తు చేశారు. ఆరెస్పీ నేత, ఎంపీ ప్రేమచంద్రన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలన్నారు. ప్రతిపక్షాలు చీలిపోతే 2024లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతుందనీ హెచ్చరించారు. సీపీఐ(ఎంఎల్) నేత ఎన్ మూర్తి మట్లాడుతూ ప్రజా స్వామ్య హక్కులకు భంగం కలిగిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాటం సాగించాలన్నారు. ఏఐఎఫ్బీ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్షాల ఐక్యత ఎంతో అవసరమన్నారు. మహాసభల ప్రారంభ సూచకంగా బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సుందరయ్య పార్క్ చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎఫ్బీ పతాకాన్ని దేబబ్రత బిశ్వాస్ ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి నాయకులు, ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బీ డిప్యూటీ చైర్మెన్, మాజీ ఎమ్యెల్యే పివి కఠిరావన్, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు జి దేవరాజన్, జిఆర్ శివశంకర్, నరేన్ ఛటర్జీ, గోబింద రారు, జ్యోతి రాజన్, అమరేష్ కుమార్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్వి ప్రసాద్, ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, కార్యదర్శి కె తేజదీప్ రెడ్డి, నాయకులు బి రాములు యాదవ్, జి వంశీధర్ రెడ్డి, కొమ్మూరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.