Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుర్భరంగా పంచాయతీ కార్మికుల జీవితాలు
- 40 ఏండ్ల నుంచి పని చేసినా పర్మినెంట్ కాలేదు
- ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు నెలల జీతాలు పెండింగ్‌లోనే
- ప్రశ్నించినా..వినకున్నా కొలువు పోయినట్టే
- మల్టీపర్పస్ పనితో కార్మికులు చనిపోతున్నారు:గ్రామపంచాయతీ సిబ్బంది
- పాదయాత్ర బృంద సభ్యుల ఆవేదన
పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ అనేవారు. కానీ ఇపుడు ఆ పల్లెల్లో దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. పంచాయతీల్లో పనిచేసే కార్మికుల గోస ఎవరికీ పట్టడంలేదు. నాలుగు దశాబ్దాలనుంచి పనిచేస్తున్నా సర్కారుకు కనిపించటంలేదు. వినిపించటంలేదు.
నెలల తరబడి జీతాల్లేకపోయినా బాధ్యతగా పనిచేస్తున్నారు. పాదయాత్ర తలపెట్టిన పంచాయతీ కార్మికులను నవతెలంగాణ ప్రతినిధి పలకరిస్తే...
వారి కండ్ల నిండా కన్నీళ్లు ఉబికివచ్చాయి.
అచ్చిన ప్రశాంత్
'పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాం. ఇప్పటిదాకా నాలుగు జిల్లాలు తిరిగాం. వేలాది మంది పంచాయతీ కార్మికులను కలిశాం. ఎవర్ని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడలో 60 ఏండ్లకు పైబడిన ఓ పారిశుధ్య కార్మికురాలు బాధతో 'అయ్యా 40 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్ కాలేదయ్యా. బతికుండంగ అయితదో లేదో బిడ్డా' అంటుంటే కండ్లు చెమర్చాయి. రాష్ట్ర సర్కారేమో ప్రతి పంచాయతీ కార్మికునికీ రూ.8,500 ఇస్తున్నామని గొప్పలు చెబుతుంటే..భువనగిరి మండలంలో ఓ కార్మికు రాలు ''జీతం రూ.2,500 వస్తుందయ్యా జర పెంచేలా చూడండయ్యా..'' అంటూ వేడుకున్నది. ఏ ఊరుకెళ్లినా మూడు నెలలు, నాలుగు నెలలు....ఏడు నెలల నుంచి జీతాలొస్తలేవు బిడ్డా అంటున్న పరిస్థితి. అన్ని నెలల నుంచి జీతాల్లేకుండా ఎలా బతకాలో రాష్ట్ర సర్కారే చెప్పాలి. జీతాల గురించి కార్మికులు ప్రశ్నించినా..చెప్పిన పని చేయకున్నా ఉన్న ఆసరాను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తేయాలి. అందర్నీ పర్మినెంట్ చేయాలి. క్యాడర్‌వారీగా వేతనాలు చెల్లించాలి. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి' అని గ్రామపంచాయతీ సిబ్బంది పాదయాత్ర బృంద సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ గౌరవా ధ్యక్షులు పాలడుగు భాస్కర్ నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్రలోని బృంద సభ్యులు తమ అనుభవాలను నవతెలంగాణతో పంచుకున్నారు. ఆ విశేషాలివి.
పెన్నుపట్టి రాసిన కారోబార్లతో మోరీలు తీయిస్తున్నారు..
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు పి.గణపతిరెడ్డి
కారోబార్లలో నూటికి 90 శాతం వరకు డిగ్రీ, ఆపై చదివినవారే. పెన్నుబట్టి రాశారే తప్ప ఏనాడూ పారబట్టి మోరీల్లో మన్ను తీయలేదు. కరెంటు పనిచేయలేదు. ట్రాక్టర్ నడపలేదు. ఇప్పుడంతా తలకిందలైంది. మల్టీపర్పస్ విధానంతో అన్నీ చేయాల్సి వస్తున్నది. కారోబార్లకు పంచాయతీ నిధులపై అవగాహన ఉంటుంది. వాటి నుంచి వేతనాలు ఇవ్వొచ్చుగా అని అడిగితే సర్పంచ్‌లు, ఉప సర్పంచులకు టార్గెట్ అవుతున్నారు. పల్లెప్రగతి పనులు, ఉపాధి హామీ పనుల(ఫీల్డు అసిస్టెంట్లను తీసేసిన నుంచి) నిర్వహణ బాధ్యతనూ కారోబార్లకే అప్పగించారు. చెట్లు పెట్టించడం, వాటికి నీళ్లు పోయించడం, ఎన్నిబతుకు తున్నయి? ఎన్ని చనిపోయాయి? అనేది కారోబార్లే చూసుకోవాలి. ఏక్కడైనా పైపులైన్లు పగిలిపోతే సర్పంచ్, కార్యదర్శిలకు చెప్పరు. అంతా కారోబార్పైనే వచ్చి పడుతున్నారు. కార్యదర్శుల కంటే ఎక్కువ పనిని భుజాన వేసుకుని చేసేది కారోబార్లే. ఎప్పుడైనా పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి రాకపోతుందా? అనే ఒకే కారణంతో ఎవరెన్ని మాటలన్నా, వేధింపులకు గురిచేస్తున్నా కారో బార్లంతా మనస్సును చంపుకుని పనిచేస్తున్నారు.
మోరీలు తీసేటోళ్ల మీద రాజకీయ కక్షలేంటి?
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్
ఎర్రబెల్లి దయాకర్‌రావు నియోజకవర్గంలో డంపింగ్‌యార్డు, ప్రకృతి వనాలకు భూములు ఇచ్చిన వారిని పంచాయతీ కార్మికులుగా తీసుకుని పాతోళ్ల ను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. ఇది చాలా అన్యా యం. 20, 30 ఏండ్ల నుంచి ఊరు కోసం గొడ్డు చాకిరీ చేసినోళ్లను ఎట్టా తీసేస్తారు? బాధిత కుటుంబాలకు న్యాయం దక్కేదాకా పోరాడుతాం. పాలకుర్తి నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లు కొందరిని పనిలో పెట్టుకుని వారి నుంచి ప్రతినెలా రూ.1,500 నుంచి 2 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.ఆ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉం దంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేవరుప్పల మండలంలోని ఓ పంచాయతీకి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలు మొదటి నుంచి కాంగ్రె స్కు ఓటేస్తూ వస్తున్నాయి. తనకు ఓటేయలేదనే కక్షతో అధికార పార్టీ సర్పంచ్ వారిద్దరినీ పంచాయతీ లో పనిచేయాల్సిన అవసరం లేదని తీసేశాడు. ఊర్ల మోరీలు తీసేటోళ్ల మీద కూడా రాజకీయ కక్షలేంటి? ఇలాంటి పరిస్థితిని ఖండిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు లేఖ కూడా రాశాం.
కుక్క చస్తే కాలనీవాళ్లకే ఇబ్బందా? పంచాయతీ కార్మికులకు రోగాలు రావా?
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.పాండు
మా పాదయాత్ర ఇప్పటిదాకా నాలుగు జిల్లాల్లో కొనసాగింది. పంచాయతీ కార్మికుల్లో ఎక్కువగా దళితులు గిరిజనులే కనిపిస్తున్నారు. మోరీలు తీసే పారిశుధ్య కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదు. వారితో వెట్టిచాకిరీ చేయించుకుం టున్నారు. బంధువులు చనిపోయినా, ఇంట్లో పని ఉన్నా..అన్నీ పక్కనపడేసి ఉరకాల్సిందే. మేం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓ కార్మికురాలికి ఫోన్‌చేసి ''కాలనీలో కుక్కచనిపోయింది తీసేద్దువు గానిరా'' అంటూ హుకుం జారీచేశాడు. ''సార్ నేను బయట ఉన్నా'' అని కార్మికురాలు చెప్పినా ''అదంతా నడ వదు ఫస్టు ఆ కుక్కను తీసేయిపో. కాలనీవాళ్లకు వాసన కొడుతుందంట'' అంటూ బెదిరింపులకు దిగాడు. ఇదీ క్షేత్రస్థాయిలోని పరిస్థితి. కంపుకొట్టే మోరీల నుంచి మట్టిని, రోతను తీసే క్రమంలో వారు తరుచూ రోగాలపాల వుతున్నారు. ఈ పనిచేసేటం దుకు ఎవ్వరూ ముందుకు రారు. ముందుకొచ్చినోళ్లకు కనీస సౌకర్యాలు, వైద్య సేవలు అందించా లనే సోయి రాష్ట్ర సర్కారుకు ఉండాలి కదా!. కొందరు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు తమ సొంత పనులకు కూడా వాడుకుంటున్నట్టు మా దృష్టి కి వచ్చింది. వాటన్నింటినీ నోట్ చేసుకుంటున్నాం.
చస్తే ఐదు, పదివేల రూపాయలిచ్చి ముఖం చాటేస్తున్నరు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వినోద్
పంచాయతీ కార్మికులు పనిచేసే క్రమంలో గాయాల పాలైనా, మరణించినా అందుతున్న సాయం అంతంతే. భువనగిరి జిల్లా వీరవెల్లి పంచాయతీ పరిధిలో భిక్షపతి అనే కార్మికుడు చనిపోతే గవర్నమెంట్ నుంచి అందిన సహాయం ఐదు వేల రూపాయలు మాత్రమే. గతంలో ఉన్న పాత జీవో ఆధారంగా అంత్యక్రియల కోసం ఇచ్చా రంట. ఎంత ఘోరం.. ఆ కుటుంబం పరిస్థితేంటి? ఊరి కోసం గొడ్డుచాకిరీ చేస్తున్న కార్మికులకు సర్కారు చేసే మేలు ఇదేనా? ఇదే కాదు ట్రాక్టర్ ప్రమాదాలు, స్తంభాల మీద బుగ్గలు వేసే క్రమంలో కార్మికులు చనిపోతున్నా సర్కారు పట్టించుకోకపోవడం దారుణం. వారికి బీమా సౌకర్యం కూడా లేదు. వారికి ఈఎస్ఐ, పీఎఫ్, బీమా వంటి సౌకర్యాలను అందించాలనే డిమాండ్‌తో రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తాం.
ఏడెనిమిది నెలలు జీతాలివ్వకుంటే ఎట్ట బతుకుతరు?
: చాగంటి వెంకటయ్య
తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాదయాత్రలో ఏ ఊరికెళ్లినా మూడు నుంచి ఏడు నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయంటూ పంచాయతీ కార్మికులు మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్ర సర్కారేమో రూ.8,500 ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్పటికీ మెజార్టీ గ్రామాల్లో వచ్చిన జీతాన్నే కార్మికులు పంచుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. అదీ ఇష్టానుసారంగా ఉంది. భువనగిరి జిల్లా కేసారం గ్రామంలో పంచాయతీ కార్మికులకు రూ.2,500 వేతనమే దక్కుతున్నది. ఇల్లు ఎట్టా గడుస్తున్నదని మేం ప్రశ్నిస్తే...సర్పంచులు దయతలచి ఎంతో కొంత ఇస్తే తీసుకుంటున్నామంటున్నారు. కొందరేమో అప్పులు చేసి బతుకుతున్నరంట. మూడు నాలుగు నెలలకోసారి జీతం పడగానే సర్పంచులు, ఊరోళ్లదగ్గర చేసిన అప్పులు తీరుస్తున్నరంట. వాళ్ల జీవితమంతా జీతాల కోసం ఆశగా ఎదురు చూడటం.. రాగానే అప్పులు కట్టడం, మళ్లీ ఒకటో తేదీ రాగానే అప్పులు చేయడం ఒక చక్రంలా తిరుగుతున్నది.
ఎందుకింత కష్టపడుతున్నరు? కూలి పనికిపోయినా రూ.500-600 పడుతయి కదా? అని అడిగితే..30,40 ఏండ్ల నుంచి, పది, ఇరవై రూపాయల జీతం కాడి నుంచి చేస్తున్నం బిడ్డా.. పర్మినెంట్ కాకపోతదా? అనే చిన్న ఆశతోనే చేస్తున్న మంటున్నారు.