Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రివర్‌ఫ్రంట్ పూర్తయితే కరీంనగర్‌కు పర్యాటక శోభ : సీఎంఓ సెక్రటరీ స్మితాసబర్వాల్
- కలెక్టరేట్ సహా కేబుల్ బ్రిడ్జి పనుల పరిశీలన
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. కరీంనగర్ అభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం ప్రభుత్వం నుంచి అందుతుంది. కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి సహా ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి' అని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లాలో పర్యటించారు. కరీంనగర్ మానేరు వాగుపై నిర్మిస్తున్న రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన కేబుల్ బ్రిడ్జిని సందర్శించి దాన్ని ఆనుకుని సాగుతున్న అప్రోచ్ రోడ్డు పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాన్ని పరిశీలించారు. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన మీడియన్ ఎత్తును తగ్గించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. రెసిడెన్సి ఏరియాలు, గృహసముదాయాల్లో అందమైన మొక్కలు నాటాలనీ, పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. ఐడీఓసీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలతో కరీంనగర్ మరింత అందంగా రూపొందనుందని, శానిటేషన్, నగర అభివృద్ధి పనులు నిత్యం జరిగేలా చూడాలని సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే పర్యటక శోభ సంతరించుకుని మహానగరాల నుంచి ప్రజలు కరీంనగర్‌కు దారిపడతారన్నారు.