Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నా
- జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి
- బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
ఎమ్మెల్యే స్వార్థపూరిత కుట్రకు బలయ్యానని, బాధాతప్త హృద యంతోనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజరు కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసి గత నెల 25న మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బోగ శ్రావణి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, 37వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన తనకు ప్రజల నుంచి, వివిధ సంఘాల నుంచి ఎంతో మద్దతు, భరోసా లభించిందన్నారు. ఎమ్మెల్సీ కవితక్క ఆహ్వానం మేరకు తాము బీఆర్ఎస్ పార్టీలో చేరామని, కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదంతో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడి పని చేసి ప్రజల అభిమానాన్ని సంపాదించానన్నారు. మూడు సంవత్సరాలపాటు జగిత్యాల పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపారు. పదవుల కన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని భావించి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానే తప్ప పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. అయితే, తాను నమ్మిన పార్టీ నుంచి తనకు ఎలాంటి ఓదార్పుగానీ, భరోసాగానీ లభించలేదనే ఆవేదనతో, బాధాతప్త హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తాను బీఫామ్ ఇవ్వడం వల్లే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యిందంటూ ఎమ్మెల్యే మాట్లాడటాన్ని శ్రావణి తప్పుబట్టారు. తాను ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యానని తెలిపారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వారిని, కవితక్క మనుషు లను కుట్రపూరితంగా పార్టీకి దూరం చేయాలనుకుంటున్న ఎమ్మెల్యే విజయం సాధించారని, అనుకున్నది సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితక్కపై తనకు అభిమానం ఎప్పటికీ ఉం టుందన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, కౌన్సిలర్లకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.