Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దంత విద్యార్థులకు ఎప్పటిలాగే హాస్టల్ వసతి
- ప్రిన్సిపాల్ సర్క్యులర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని ప్రభుత్వ దంత కళాశాల (ఉస్మానియా) విద్యార్థులకు హాస్టల్ వసతి యధావిధిగా కొనసాగుతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు. ఈ మేరకు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో ఈ నెల మొదటి తేదీ నుంచి కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన జయప్రదమైంది. 2018 బ్యాచ్‌కు సంబంధించిన విద్యార్థినీలు ఈ ఏడాది మూడో సంవత్సరం పూర్తి చేసుకుని ఇంటర్న్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని హాస్టల్ ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాల్ ఆదేశించిన విషయం విదితమే. గతంలో ఎప్పుడూ లేని విధంగా జారీ అయిన ఆదేశాలతో 42 మంది విద్యార్థినీలు ఆందోళన చెందారు. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా వారికి మద్ధతుగా ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా విన్నవించుకున్నారు.
అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విద్యార్థినీలు గురువారం ఉదయం ధర్నాకు ఉపక్రమించారు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదంటూ కళాశాలలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో డీఎంఈ నుంచి మౌఖిక ఆదేశాలంటూ హాస్టల్ వసతిని కొనసాగిస్తామని హామీనిచ్చారు. ఆ మేరకు సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.