Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత, గిరిజన ఎమ్మెల్యేలకు పంచాయతీ కార్మికుల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దళిత, గిరిజన ఎమ్మెల్యేలు నోరు విప్పాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లా యీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, అధ్యక్షులు గ్యార పాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య గురువారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. 'రాష్ట్రంలో సుమారు 40వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వారిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులు. వీరికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదు. గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం వారిని పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చింది. అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. పాలకులు మారినా పంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేద'ని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాల వల్ల అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో వీరు నేటికీ వివక్షకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దళిత, గిరిజన ఎమ్మెల్యేలు నోరు విప్పాలనీ, ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.