Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కంలకు ఏటా ఈఆర్సీ చెప్పేమాటే...ఆచరణే శూన్యం
- ఏదో ఒక పేరుతో వినియోగదారులపైనే ఆర్థికభారాలు
- 2023-24 ఏఆర్‌ఆర్‌లపై నేడు బహిరంగ విచారణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అంతర్గత సామర్ధ్యం పెంచుకోవాలి. విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారాలు తగ్గించాలి'' ఎప్పుడు బహిరంగ విచారణలు జరిగినా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) డిస్కంలకు చెప్పేమాటే! దీనికి 'ఓకే..ఓకే' అంటూ సీఎమ్‌డీలు తల ఊపడం ప్రతి బహిరంగ విచారణ లో షరామామూలుగా జరిగేదే! ప్రజలపైన భారం పడకుండా ఆ ఏడాదిలో అంతర్గత సామర్ధ్యం పెంపు వల్ల డిస్కంలు చేకూర్చిన ఆర్థిక ప్రయోజనం ఎంత? అనే దానికి ఎలాంటి కొలమానం లేదు. దీనితో ప్రజలపై భారాలు వేసే ప్రతిసారీ...అంతర్గత సామర్థ్యం పెంచుకుంటాం అని డిస్కంలు చెప్పడం ఆనవాయితీగా మారింది. డిస్కంలు టీఎస్ఈఆర్సీకి సమర్పించిన 2023-24 వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలపై (ఏఆర్ఆర్) శుక్రవారం హైదరాబాద్‌లో బహిరంగ విచారణ జరగనుంది. ఇప్పటికే సిరిసిల్ల (సెస్), హన్మకొండ ప్రాంతాల్లో ఈఆర్సీ బహిరంగ విచారణలు పూర్తి చేసింది. శుక్రవారం జరిగే దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) బహిరంగ విచారణ తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా టీఎస్ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ సందర్భంగా వచ్చిన పలు అభ్యంతరాలపై డిస్కంలు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్పాయి. అఖిల భారత కిసాన్ సభ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి 2018-19 నుంచి 2021-22 వరకు ఏఆర్‌ఆర్‌లు సమర్పించలేదనీ, ఆ కాలంలో డిస్కంలకు వచ్చిన రూ.36,841.63 కోట్ల లోటును ఎలా భర్తీ చేస్తారని అడిగితే...విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చిన సమాధానాలు చిత్రంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇతర పనుల్లో దేనికీ అడ్డంకిగా లేని ఎన్నికల నియమావళులే కారణమంటూ తమ అసమర్థతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు. ఆ ఆదాయలోటు భర్తీ కాకుండా 2023-24లో 10,535 కోట్లు ఆదాయలోటు ఎలా చూపుతారని అడిగిన ప్రశ్నకూ డిస్కంలు సంబంధంలేని సమాధానాలే చెప్పాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీలకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించినా ఇంకా లోటు ఏంటని అడిగితే...డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశామని సమాధానం చెప్పారు. డిస్కంల అంతర్గత సామర్ధ్యం పెంపు అంటే... విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు లేకుండానే డెవలప్మెంట్ చార్జీలు, అదనపు వినియోగ డిపాజిట్ (ఏసీడీ), ప్యానల్ బోర్డుల ఏర్పాటు వంటి పలు పేర్లతో అనధికారికంగా వినియోగదారులపై భారాలు వేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ మధ్య మరీ విచిత్రంగా గ్రామాల్లో 30 ఏండ్ల క్రితం వ్యవసాయ భూముల్లో ఉన్న కరెంటు మీటర్లకు కూడా డబ్బులు చెల్లించమని నోటీసులు ఇస్తున్న ఘన చరిత్ర కూడా డిస్కంలకే దక్కింది. డిస్కంలు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న పేర్లలో 90 శాతం మంది చనిపోయిన వారు, భూములు అమ్ముకుని వెళ్లిపోయిన వాళ్లే ఉన్నారు. అయినా ఆ భూమి మీద ఇప్పుడు ఎవరుంటే వాళ్లనే బిల్లులు చెల్లించమంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. లేకుంటే ఇప్పుడున్న మీటర్లకు కరెంటు నిలిపేస్తామనీ హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రీ పెయిడ్ మీటర్ల వ్యవహారంలోనూ డిస్కంలది అనుమానపుపాత్రగానే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వినియోగదారులకు వీటిని అమర్చినా, ఆ తర్వాత ముక్కుపిండి వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉంది. దానిలో క్రాస్ సబ్సిడీని ఎత్తేసే ప్రయత్నమూ జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పరిధిలో ఉన్న విద్యుత్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిలువరించేలా రాజకీయ పోరాటం జరుగుతున్నా, డిస్కంల స్థాయిలో 'ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తాం' అన్నట్టే అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ప్రజాకోణంలో వారికి లబ్ది చేకూర్చే స్వీయ నిర్ణయాలను స్వయం ప్రతిపత్తి కలిగిన డిస్కంల ఉన్నతస్థాయి అధికారులు చేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది కరెంటు చార్జీలు పెంచేది లేదనీ, డిస్కంలు అలాంటి ప్రతిపాదనలు ఏమీ చేయలేదని టీఎస్ఈఆర్సీ చైర్మెన్ శ్రీరంగారావు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇప్పుడు పెంచకున్నా, ఆ తర్వాతైనా ఏదో రూపంలో ప్రజలపై ఆర్థిక భారాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టీఎస్ఈఆర్సీ అనుమతి లేకుండానే యూనిట్‌కు 30 పైసలు వరకు ట్రూ అప్ పేరుతో అదనంగా వసూలు చేసుకొనే సౌకర్యాన్ని ఈఆర్సీ కల్పించింది. అంటే మే నెల బిల్లుల్లో కరెంటు చార్జీలు మరింత పెరిగి వస్తాయి. అసమర్థ నిర్వహణ కారణంగా డిస్కంలు అప్పులపాలై, అవస్థలు పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆసరా చేసుకొని, పంపిణీ వ్యవస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టేలా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. దీన్ని తాత్కాలికంగా రాష్ట్రం తిరస్కరించినా, సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడో దగ్గర ఆ నిర్ణయాలను అమలు చేయక తప్పని పరిస్థితుల్ని కేంద్రం కల్పిస్తుండటం గమనార్హం.