Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ- సుల్తాన్ బజార్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఉచిత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 25 పని దినాల్లో 50 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేశామని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి తెలిపారు. 50 లక్షల మైలురాయి దాటిన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి క్లస్టర్ పరిధిలోని ఆగాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హిందీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఉచిత కంటి వైద్య శిబిరంలో గురువారం వేడుకలు నిర్వహించారు. కమిషనర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ డీఎంహెచ్ఓ వెంకటి, కంటి వెలుగు ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, నాంపల్లి క్లస్టర్ ఎస్పీహెచ్ఓ నాగేంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం శ్వేతా మహంతి మాట్లాడుతూ.. గత నెలలో ఖమ్మంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సీఎం కేసీఆర్, కేరళ, ఢల్లీ, పంజాబ్ సీఎంల చేతుల మీదుగా ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు 50 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను వైద్య శిబిరంలోనే అందించామని తెలిపారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారిని ప్రభుత్వ కంటి ఆస్పత్రులకు పంపించి ఏర్పాట్లు చేశామన్నారు. యువత కూడా పెద్దఎత్తున కంటి వెలుగు శిబిరానికి తరలివస్తూ పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రతి ఒక్కరూ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆగాపుర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రిన్, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, డీఈవో నవీన్, ఆప్తమాలజీ యాదగిరి, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.