Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో పలువురికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-యాచారం/ అడ్డగూడూర్
జనంపై కుక్కల దాడులు వరుసగా కొనసాగుతున్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం, యాదాద్రిభువనగిరి జిల్లాలో గురువారం కుక్కలు దాడి చేశాయి. యాచారంలో ఓ పిచ్చికుక్క సుమారు 10మందిపై ఏకకాలంలో దాడి చేసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పలు గ్రామాలకు చెందిన పలువురు పనుల నిమిత్తం యాచారం మండల కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో యాచారం ఎల్లమ్మ గుడి ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఎదురొచ్చిన వారందరిపైనా పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన వారిలో బోడ వెంకటమ్మ (మల్కీజ్ గూడ), కొత్త రాములమ్మ (యాచారం), తాండ్ర శ్యాంసుందర్ (మొండి గౌరెల్లి), గడల నందీశ్వర్ (యాచారం), కొప్పు సాయమ్మ (ఇబ్రహీంపట్నం), బెల్లి కొమరయ్య (గాండ్లగూడ), సుధాకర్ (నంది వనపర్తి), నాగేష్ (బోడుప్పల్), వెంకటమ్మ (మేడిపల్లి) ఉన్నారు. బోడ వెంకటమ్మ కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. సాయిలు, అంజయ్య, ప్రతాప్‌ను స్థానికులు మండల కేంద్రంలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఎంపీపీ కొప్పు సుకన్య భాష, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీఓ ఉమారాణి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. మండల పరిధిలో రెండు నెలల్లో 48 మంది కుక్క కాటుకు గురయ్యారు.
మహిళపై వీధి కుక్కల దాడి
యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిత్తలూరి పూలమ్మ ఉదయం బజారుకు వెళ్లి వస్తుండగా పది వీధి కుక్కలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పూలమ్మను మండల కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.