Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్టర్ల తొలగింపుపై రైతన్నల ఉద్యమ బాట
- సమాచారం లేకుండానే కరెంట్ తీస్తున్న అధికారులు
- 20వేల తొలగింపు.. ఒక్కటీ ఉండనీయమని హెచ్చరికలు
- సీఎండీ ప్రకటనతో రైతుల్లో మరింత ఆందోళన
- ఉమ్మడి జిల్లాలో 2 లక్షల వ్యవసాయ కనెక్షన్లు
- వాటిలో 30శాతం వరకు ఆటోమేటిక్ స్టార్టర్లే..!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వచ్చిపోయే కరెంట్‌తో వేగలేక రైతులు కొన్నేళ్ల కిందట నుంచి ఆటోమేటిక్ స్టార్టర్లను ఉపయోగిస్తున్నారు. మూడు, నాలుగు నెలల కిందట వరకు వ్యవసాయానికి పగలు కరెంట్ సరఫరా కొంత మెరుగ్గా ఉన్నా.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఒకటి, రెండు ఎకరాలున్న సన్న, చిన్నకారు రైతులు ఓ వైపు ఈ భూమి సేద్యం చేస్తూ.. మరోవైపు కూలి పనులకు వెళ్తున్నారు. పైగా చేలు కూడా దూరాభారం కావడంతో ఆటోమేటిక్ స్టార్టర్లను నమ్ముకున్నారు. ఇప్పుడీ స్టార్టర్లను తొలగిస్తుండటంతో చిన్నరైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 లక్షల వరకూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వాటిలో 30 శాతానికి పైగా ఆటోమేటిక్ స్టార్టర్లే ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 20వేల వరకూ తొలగించారు. మిగిలిన ఆటో స్టార్టర్లన్నీ తొలగిస్తామని సీఎండీ గోపాలరావు ప్రకటించడంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఎన్నెస్పీ పరివాహక ప్రాంతాల్లోని రైతులు వరి సేద్యం ఎక్కువగా చేస్తుండటంతో ఆటోస్టార్టర్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. విద్యుత్ అధికారులు ఆటో స్టార్టర్లను తీసుకెళ్లడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తొలగింపుపై స్పెషల్ డ్రైవ్..
ఆటోస్టార్టర్ల తొలగింపుపై విద్యుత్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటుందనే పేరుతో ఈ డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. డివిజన్ స్థాయి అధికారులను దీనికోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఇప్పటికే పాలేరు, బోనకల్, సత్తుపల్లి, వైరా.. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో ఆటోస్టార్టప్లను తొలగించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 8,932 ఆటో స్టార్టప్‌లను తొలగించారు. టౌన్ డివిజన్ పరిధిలో 1,981, ఖమ్మం రూరల్ డివిజన్లో 2,850, సత్తుపల్లిలో 1,772, వైరా డివిజన్లో 2,329 స్టార్టర్లను ఇప్పటికే తొలగించారు. ఖమ్మం జిల్లాలో 1.10 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఎన్ని ఆటోమేటిక్ స్టార్టర్లు ఉన్నాయనే సమాచారం విద్యుత్‌శాఖ అధికారుల దగ్గర స్పష్టంగా లేదు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఉన్న ఆటోమేటిక్ స్టార్టర్లన్నీ తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
విచ్చలవిడి బ్రేక్డౌన్లతో సతమతం
విద్యుత్ సక్రమంగా ఇచ్చినా బ్రేక్డౌన్లతో రైతులు సతమతం అవుతున్నారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన టీఎస్ఎన్పీడీసీఎల్ ఈఆర్సీ సమావేశంలో వారంలో ఒకరోజు అదీ నిర్దేశిత సమయంలో మాత్రమే ఎల్సీలు ఇవ్వాలని విద్యుత్ వినియోగదారుల సంఘం సభ్యులు సూచించారు. బ్రేక్డౌన్ల పేరుతో రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ వచ్చిపోతుండటంతో పనులన్నీ వదులుకుని రైతులు చేల వద్ద పడిగాపులు కాయడం కష్టతరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను ఆశ్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వ్యవసాయానికి 24 గంటలు కాకపోయినా పగలు 12 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనేది రైతుల డిమాండ్‌గా ఉంది.
కెపాసిటర్లు వాడాలంటున్న విద్యుత్‌శాఖ
విద్యుత్‌శాఖ అధికారుల మాట మరోలా ఉంది. ఆటోస్టార్టర్లు ఉపయోగిస్తే మోటార్లన్నీ ఒకేసారి ఆన్కావడంతో ఐదు సెకన్లపాటు ఐదు రెట్ల అదనపు విద్యుత్‌ను తీసుకోవడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతు న్నాయని చెబుతున్నారు. 25 కేవీ (కిలోవాట్స్) సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో నాలుగైదు వ్యవసాయ మోటార్లను ఏర్పాటు చేస్తారు. 63 కేవీ అయితే ఐదుకు పైగా మోటార్లు ఉంటాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మోటార్లలో 99శాతం 5 హెచ్పీవే. 12వ తేదీ నుంచి నిరంతరాయంగా సరఫరా ఇస్తున్నాం కాబట్టి రైతులు ఆటోస్టార్టర్లను వదిలి రూ.300 నుంచి రూ.450 వరకు విలువ చేసే కెపాసిటర్లు వాడితే ఇటు మోటార్లు అటు ట్రాన్స్ఫార్మర్లు సేఫ్‌గా ఉంటాయని సూచిస్తున్నారు.
పొద్దస్తమానం పొలం దగ్గరే ఉండలేము...
కరెంట్ కోసం ఎదురుచూస్తూ పొద్దస్తమానం పొలం దగ్గరే ఉండలేం. ఒకటి, రెండు ఎకరాలుంటే దానిలో పంట వేసుకుని, మరోచోట మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. వచ్చిపోయే కరెంట్‌తో అక్కడికిక్కడికి తిరిగి మోటార్లు ఆన్చేయాలంటే అయ్యే పనేనా..? అందుకే ఆటోమేటిక్ స్టార్టర్లు వాడుతున్నాం. కానీ చెప్పాపెట్టకుండా అధికారులు వాటిని పీక్కెళ్లారు. పోకుండా కరెంట్ ఇవ్వడం వాళ్లతో కాదు కాబట్టి.. మా స్టార్టర్లు మాకు తెచ్చి ఇవ్వాలి.
పానుగోతు చీన్యానాయక్, కౌలు రైతు, బొజ్జతండా, కూసుమంచి
రైతులు అర్థం చేసుకుని సహకరించాలి
ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల విద్యుత్ దుబారా అవుతుంది. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీనివల్ల రైతులకే నష్టం కాబట్టి అర్థం చేసుకుని సహకరించాలి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వారే అర్థం చేసుకుని ఆటోస్టార్టర్లను తీసివేసి కెపాసిటర్లు ఉపయోగించాలి.
- సురేందర్, ఎస్ఈ, విద్యుత్‌శాఖ, ఖమ్మం
ట్రిప్ లేకుండా కరెంట్ ఇవ్వాలి
ట్రిప్ లేకుండా కరెంట్ ఇస్తే రైతులకు ఆటోమేటిక్ స్టార్టర్లతో పని ఉండదు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయదు. ఆటోస్టార్టర్లు వచ్చినప్పటి నుంచే విద్యుదాఘాతంతో రైతులు మృతిచెందడం తగ్గింది. రాత్రిళ్లు ప్రశాంతంగా ఇండ్ల వద్ద నిద్రపోగలుగుతున్నారు. కానీ అధికారుల వాదన సవ్యంగా లేదు.
- బొంతు రాంబాబు, తెలంగాణ రైతుసంఘం, ఖమ్మం జిల్లా కార్యదర్శి