Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ జిల్లా పీజీ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకుల ఖాళీలు
- ఇన్చార్జి ప్రిన్సిపాల్స్‌తో నిర్వహణ
- అద్దె భవనాల్లో కాలేజీలు
- నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వసతి గృహాలు
నవతెలంగాణ- ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ కళాశాలలను యూనివర్సిటీ గాలికొదిలేసింది. కొద్దిపాటి కోర్సులతో ప్రారంభించి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో సౌకర్యాలు లేక ఆదరణ కరువైంది. రెగ్యులర్ అధ్యాపకులే కాదు, ప్రిన్సిపాల్స్ కూడా లేరు. ఇన్చార్జి ప్రిన్సిపాల్స్‌తో నెట్టుకొస్తున్నారు. జోగిపేట్, నర్సాపూర్ కాలేజీలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. సిద్దిపేటలో భవన నిర్మాణం పూర్తయినా వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. 5 జిల్లాల్లో పీజీ కళాశాలలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ అధికారులు దృష్టి సారించి అభివృద్ధి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో 2015లో పీజీ కాలేజీని 5 కోర్సులతో ప్రారంభించారు. అయితే, 2 కోర్సుల్లో అడ్మిషన్స్ రావడం లేదు. అద్దె భవనంలో నడుస్తోంది. కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులతో మూడు కోర్సులల్లో విద్యా బోధన జరుగుతున్నది. ఇక్కడ స్వీపర్, ల్యాబ్ అసిస్టెంట్స్, క్లర్క్ వీరంతా అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఇక్కడ టీచర్ పోస్టులు 31, నాన్ టీచింగ్ - 39, హాస్టల్స్ నిర్వహణకు 32 ఉద్యోగాలు మంజూరయ్యాయి. అయితే, ఎక్కువ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నలుగురు కాంట్రాక్టు అధ్యాపకులు, మిగతా వారు పార్ట్ టైంలో పని చేస్తున్నారు. సొంత భవనాలు, హాస్టల్స్ కోసం గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించినా నిర్మాణం చేపట్టలేదు.
జోగిపేట్ కాలేజీ..
సంగారెడ్డి జిల్లా జోగిపేట్‌లో 2014లో ఓయూ పీజీ కాలేజీ ప్రారంభమైంది. నాడు 5 కోర్సులతో ప్రారంభం కాగా, ప్రస్తుతం 2 కోర్సులు నడుస్తున్నాయి. 3 కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకోవడం లేదని సమాచారం. అధ్యాపకుల్లో ఒకరు కాంట్రాక్టు, మిగతా వారు పార్ట్ టైమ్‌గా పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్‌లో ఇద్దరు కాంట్రాక్టు, ఆరుగురు అత్యవసర సేవల్లో (ఎసెన్షిల్ డ్యూటీ / డైలీ వైజ్ ) పనిచేస్తున్నారు. ఈ కాలేజీలో కూడా 31 అధ్యాపక పోస్టులు, సుమారు 30 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరైన ఖాళీలు నింపడంలేదు.
సిద్దిపేటలో..
సిద్దిపేటలో ఓయూ పీజీ కాలేజీ 1993లో ఎంబీఏ, ఎంసీఎ కోర్సులతో ప్రారంభమై.. ప్రస్తుతం 6 కోర్సుల్లో విద్యాబోధన నడుస్తోంది. పరిపాలనా భవన్‌ను మూడేండ్ల కిందట ప్రారంభించారు. బాల బాలికల హాస్టల్ భవన నిర్మాణం పూర్తయి ఏడాది అయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వెంటనే వసతి గృహాన్ని ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ కాలేజ్‌లో 13 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగతా వారు పార్ట్ టైమ్‌లో పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్‌లో ఒకరు రెగ్యులర్ ఉద్యోగి, మిగతావారంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఆరు కోర్సులు ఉండగా, ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్‌లో నడుస్తున్నది. మిగతా 5 కోర్సులు రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్నాయి.
వికారాబాద్ పీజీ కాలేజీ..
వికారాబాద్ జిల్లాలో పీజీ కాలేజీ 1993లో ప్రారంభించారు. కొన్నాళ్లపాటు స్థానికంగా ఎయిడెడ్ కాలేజ్‌లో నడిచింది. తరువాత సొంత భవనం నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఎంబీఏ కోర్సు మాత్రమే నడుస్తోంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్. గతంలో ఉన్న ఎంసీఏ కోర్సును ఎత్తేశారు. ఇద్దరు కాంట్రాక్టు అధ్యాపకులు, ఇద్దరు పార్ట్ టైమ్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఐదుగురు నాన్ టీచింగ్ సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఓయూ పీజీ కాలేజీ, మిర్జాపూర్..
మెదక్ జిల్లా మిర్జాపూర్‌లో 1980లో 2 కోర్సులతో పీజీ కాళాశాల ప్రారంభమైంది. ఈ సంవత్సరం మరొక కోర్సు ప్రారంభమైంది. 43 ఎకరాల భూమితోపాటు సొంత భవనాలు, విద్యార్థులకు వసతి గృహం, ఉద్యోగుల క్వార్టర్స్, గెస్ట్ హౌస్ ఉంది. కో ఎడ్యుకేషన్ కావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఓయూ అధికారులు తాజాగా కో ఎడ్యుకేషన్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులు, మిగతా వార పార్ట్ టైమ్‌లో పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్‌లో మొత్తం 14 మంది పనిచేస్తుండగా, వారిలో ఐదుగురు రెగ్యులర్, ఇద్దరు టైం స్కెల్, ఏడుగురు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
ఇన్చార్జి ప్రిన్సిపాల్సే దిక్కు..
గతంలో పీజీ కాలేజీలు ప్రారంభమయ్యాక రెగ్యులర్ అధ్యాపకులు ప్రిన్సిపాల్‌గా ఉంటే ప్రిన్సిపాల్గానే వ్యహరించేవారు. కాంట్రాక్టు అధ్యాపకులు ప్రిన్సిపాల్‌గా ఉంటే వారిని ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా అని సంభోదించే వారు. వీరికి పనిలో కొంత వెసులుబాటు, నెలకు రూ.500 ప్రిన్సిపాల్ అలవెన్స్ ఉండేది. 2022 జనవరి నుంచి ఇన్చార్జి ప్రిన్సిపాల్ హోదాను కో ఆర్డినేటర్‌గా మార్పు చేసి, రూ.500 అలవెన్స్ తొలగించారు. కానీ స్కాలర్షిప్, బస్‌పాస్‌లు, టీసీలు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ జారీ చేసే విషయంలో మాత్రం ప్రిన్సిపాల్‌గా సంతకం చేసి స్టాంప్ వేయాల్సి ఉంది. కో ఆర్డినేటర్ స్టాంప్ వేయడం వల్ల విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొం టున్నారు. బస్ పాస్, స్కాలర్ షిప్ తిరస్కరణకు గురైనట్టు సమాచారం.
పీజీ కళాశాలల అభివృద్ధికి కృషి
ఓయూ జిల్లా పీజీ కాలేజీల డెరైక్టర్ ప్రొ. వై.జయప్రకాష్ రావు
ఓయూ పరిధిలోని పీజీ కళాశాలల అభివృద్ధి కోసం వీసీ కృషి చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని వాటిని మరింత అభివృద్ధి చేస్తాం. అతి త్వరలోనే సిద్దిపేట వసతి గృహాలను ప్రారంభిస్తాం. జోగిపేట్‌లో సొంత భవనం నిర్మాణం కోసం, తక్కువగా అడ్మిషన్స్ ఉన్న కోర్సులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నర్సాపూర్ పీజీ కళాశాలకు సొంత భవనం నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. కొత్త కోర్సులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వికారాబాద్‌లో ఎంసీఏ కోర్సు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీజీ కళాశాలల వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.