Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీతిపై ర్యాగింగ్ కేసులో సీనియర్ మెడికో సైఫ్ అరెస్ట్
- సైఫ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదన్న పోలీసులు
- రాజకీయ దుష్ప్రచారం చేయొద్దు : వరంగల్ సీపీ ఏవీ రంగనాధ్
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ మొదటి సంవత్సరం అనస్తీషియా విద్యార్థిని డాక్టర్ దరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్యవిద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమికంగా భావించి సైఫ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్ తెలిపారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించినట్టు వాట్సాప్ చాటింగ్ ద్వారా తేలిందన్నారు. సీనియర్లు, జూనియర్లు మొత్తం 31మంది వాట్సాప్ గ్రూపులో ఉన్నారన్నారు. తనను ఎందుకు వేధిస్తున్నా వని, ఏమైనా ఉంటే హెచ్ఓడీకి ఫిర్యాదు చేయమంటూ ప్రీతి సైఫ్‌కు మెసేజ్ చేసినట్టు చెప్పారు. ప్రీతి మానసికంగా ఇబ్బంది పడటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని భావిస్తున్నట్టు తెలిపారు. వేధింపులు, అవమానించడం ర్యాగింగ్ కిందకు వస్తుందని భావించి ర్యాగింగ్ కేసుగా నమోదు చేశామన్నారు. ఈనెల 18న ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో ప్రీతి డ్యూటీ చేస్తుండగా, కేస్‌షీట్ విషయంపై ప్రీతిని వాట్సాప్ గ్రూపులోనే డాక్టర్ సైఫ్ తీవ్రంగా మందలించాడు. వారిద్దరి వాట్సాప్ ఛాటింగ్లతోపాటు సైఫ్ స్నేహితులతో చేసిన ఛాటింగ్‌లను కూడా పోలీసులు పరిశీలించారు. వృత్తిలో భాగంగా సబ్జెక్టుపై అవగాహన తీసుకురావడానికే ప్రీతితో మాట్లాడటం జరిగిందే తప్పా వేధించాలని కాదని సైఫ్ చెప్పినట్టు తెలిపారు. సైఫ్ తన స్నేహితులతో చేసిన ఛాటింగ్‌లో మాత్రం ప్రీతి ఎక్కువ చేస్తుందని, ఎవరూ సహకరించొద్దని కోరాడన్నారు. దీన్ని బట్టి ప్రీతిని లక్ష్యంగా చేసుకొని కామెంట్స్ చేసినట్టు అర్థమవుతోందని, దాంతో సున్నితమనస్కు రాలైన ప్రీతి ఆందోళనకు గురై విషయం ఎవరికీ చెప్పుకోలేక ఒత్తిడికి గురైనట్టు తెలిపారు. ప్రీతి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ విషయాన్ని హెచ్ఓడీ డాక్టర్ నాగార్జునరెడ్డికి తెలపగా, హెచ్ఓడీ సైఫ్, ప్రీతితో మంగళవారం వేర్వేరుగా మాట్లాడి మరోమారు ప్రీతిపై ఎలాంటి కామెంట్స్ వాట్సాప్‌లో పెట్టొద్దని, డ్యూటీలు కూడా వేర్వేరుగా చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఎంజీఎంలో ప్రీతి డ్యూటీ చేసింది. బుధ వారం తెల్లవారుజామున 3.00 గంటలకు శైలేష్‌కు ప్రీతి ఫోన్ చేసి సైఫ్‌పై ఫిర్యాదు చేయడం వల్ల తన పట్ల అందరూ వ్యతిరేకతతో వున్నారా అని ఆరా తీసి.. చాలా క్యాజువల్‌గా మాట్లాడిందని, అలాంటిదేమీ లేదని చెప్పానని శైలేష్ చెప్పినట్టు సీపీ వివరించారు. బుధవారం ఉదయం 7.00 గంటల ప్రాంతంలో ప్రీతి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిందని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, ప్రీతి గదిలో మెటజోలెమ్ ఇంజక్షన్, పెంటనిల్ ఇంజెక్షన్ లభించినట్టు చెప్పారు. సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ లభించిందని ప్యాకెట్ సీల్ తెరవలేదన్నారు. మెడికల్ కాలేజీలో సీనియర్లను జూనియర్లు 'సార్' అని పిలవాలనే కల్చర్ ఉందని, ఇది సర్వసాధారణమేనని విద్యార్థులు, ప్రొఫెసర్లు చెప్పారన్నారు. దీన్ని ర్యాగింగ్ అని అనలేమని, కాని దీనివల్ల సీనియర్లు, జూనియర్ల మధ్య కొంత గ్యాప్ ఉందనిపిస్తుందన్నారు. ఈ కేసులో నిందితుడైన డాక్టర్ సైఫ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం, బంధుత్వం లేదన్నారు. అనవసరంగా రాజకీయ దుష్ప్రచారం చేయవద్దని కోరారు. సైఫ్‌ది సాదాసీదా కుటుంబమేనన్నారు. పెంచుకున్న తండ్రి వ్యవసాయ చేసేవాడని, ఆయన చనిపోయినట్టు తెలిపారు. కన్నతండ్రి రైల్వేలో ఫిట్టర్‌గా పనిచేస్తుంటాడని తెలిపారు.
పోలీసుల నిర్లక్ష్యం లేదు.. : ప్రీతి తండ్రి నరేందర్ ఎఎస్సైగా పని చేస్తున్నాడని, ఆయనతో స్వయంగా మాట్లాడానని, విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇప్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని భావించాడని సీపీ తెలిపారు. ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదన్నారు. ఏసీపీ కిషన్‌కు ఫోన్ చేయగా ఎత్తకపోవడంతో, తనకు తెలిసిన ఎస్ఐ శంకర్ నాయక్‌తో విషయం చెప్పారని, శంకర్‌నాయక్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి బందోబస్తులో ఉండటంతో తర్వాత మాట్లాడతానని చెప్పి కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్‌కు సమాచారం అందించాడన్నారు. ప్రీతి టాక్సి కాలజీ రిపోర్టు నిమ్స్ నుంచి వస్తే అన్ని విషయాలు బహిర్గతమవుతాయన్నారు. విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ అబ్ధుల్ బారీ, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ పాల్గొన్నారు.