Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు తప్పని 'ఫార్మా' వేధింపులు
- మరోసారి భూ సేకరణ దిశగా సర్కారు
- స్థానికుల్లో భయాందోళన
- అక్కడి నుంచి గ్రామాలను తరలించే ప్రమాదం
ఫార్మాసిటీ భూ సేకరణతో రైతులకు వేధింపులు తప్పడం లేవు. రైతుల నుంచి తీసుకున్న భూములకు సరైన పరిహారం అందలేదు. దీనికితోడు బఫర్ జోన్ పేరుతో రైతుల నుంచి మళ్లీ భూ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భూములు కోల్పోయి రోడ్డున పడ్డ రైతులను బఫర్ జోన్ పేరుతో మరింత దుర్బార స్థితిలోకి నెట్టుతోంది. ప్రభుత్వం చర్యలతో తమ బతుకులు ఆగం అవుతున్నాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు. ఫార్మా భూతానికి బలవుతున్న రైతులపై కథనం.
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లోని 8 గ్రామ పంచాయతీల పరిధిలో ఫార్మాసిటీకి సంబంధించి ప్రస్తుతం 19,333 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఇందుకు పరిహారం కింద రైతులకు అసైన్డ్ భూములకు రూ.8 లక్షలు, పట్టా భూములకు రూ.16 లక్షలు కేటాయించారు. అయితే బహిరంగ మార్కెట్ ధరకు ప్రభుత్వం నుంచి రైతులకు ఇస్తున్న ధరకు పొంతన లేకపోవడతంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి తమ భూములు ఇవ్వమని కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు. అయితే ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 120 గజాల చెప్పున ఇంటి జాగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా ఫార్మాసిటీకి బఫర్ జోన్ పేరుతో మరోసారి రైతుల నుంచి 2వేల నుంచి 3వేల ఎకరాలకు పైగా భూ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. భూములు పోగా ఫార్మాసిటీకి దగ్గరలో ఉన్న గ్రామాలు కుర్మిద్ద, మేడిపల్లి, తాడిపర్తి, కొన్ని తాండాలు అక్కడి నుంచి తొలగించే ప్రమాదమూ ఉంది. ఇప్పటికే వ్యవసాయ భూములు కోల్పోయి ఉపాధి లేక బతుకుదెరువు కోసం వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్న ఇంటి జాగా కాస్తా ప్రభుత్వం లాక్కొంటే బతికెదెట్టా అని స్థానికులు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వం ఫార్మాసిటీకి కేటాయించిన భూమి సరిహద్దులో రెండు కిలో మీటర్ల మేరకు గ్రీనరీకి కేటాయించి పొల్యూషన్ బయటికి రాకుండా చూస్తామని ఆయా గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఫార్మాసిటీ నుంచి వచ్చే పొల్యూషన్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే కచ్ఛితంగా ఫార్మాసిటీ నుంచి కొంత మేరకు బఫర్ జోన్ ఏర్పాటు చేయాలన్న పొల్యుషన్ బోర్డు ఆదేశాలతో ఫార్మాసిటీకి బఫర్ జోన్ కేటాయించేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున్న చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫార్మాసిటీ చుట్టు పక్కల ఎలాంటి నిర్మాణాలు, చిన్న, చిన్న కంపెనీలు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆలోచన చేసి ప్రస్తుతం ఫార్మాసిటీకి కేటాయించిన భూముల్లో గతంలో చెప్పిన విధంగా బఫర్ జోన్ కేటాయించాలని, ఫార్మాసిటీకి వెలుపల ఎలాంటి ఆంక్షలు విధించొద్దని స్థానికులు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూముల్లో కొంత బఫర్ జోన్‌గా కేటాయిం చాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మాసిటీ వెలుపల బఫర్ జోన్ విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వం నిర్ణయం మేరకు చేయాల్సి ఉంటుంది.
- వెంకటచారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
పంట పొలాలు కోల్పోయిన రైతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారంతో జిల్లా లో గుంట జాగా వచ్చే పరిస్థితిలేదు. చాలీ చాలని పరిహారంతో రైతులు బతికేదెట్టా.. ప్రభుత్వం ఆలోచన చేయా లి. బఫర్ జోన్ పేరుతో ఈ ప్రాంతాల నుంచి ప్రజలను కదిలించే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలి.
- మధుసూదన్, స్థానికులు