Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషనర్‌కు హైకోర్టు సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీహెచ్ఎంసీలోని మారుమూల ప్రాంతాల్లోకి ఆర్టీసీ సర్వీసుల్ని పెంచడంతోపాటు కొన్ని ఏరియాల్లో ఆ సంస్థ ఉచితంగా రవాణా సదుపాయాన్ని కల్పించాలన్న పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఆర్టీసీ ఉచితంగా రవాణా సౌకర్యాన్ని ఎలా కల్పించగలదంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఢిల్లీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోందనే విషయాన్ని పిటిషనర్ తరపు లాయర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై వివరణివ్వాలంటూ ఆర్టీసీ అధికారుల్ని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్‌కు చెందిన బాలమణి సహా పలువురు వేసిన పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆర్టీసీ బస్సులు తగ్గించడం అన్యాయం, గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల సౌకర్యం, వాటి విస్తరణతోపాటు కొన్ని రూట్లలో ఉచిత బస్సులను నడిపేలా ఆర్టీసీకి ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. కమ్యూనిస్టు దేశాల్లో సైతం ఎక్కడా ఉచిత రవాణా వ్యవస్థ లేదంటూ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
రూ.50 వేల జరిమానా...
వ్యవసాయ భూ వివాదంపై అప్పీళ్లను దాఖలు చేసిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. భూ రికార్డుల్లో వారి పేరు ఉన్నట్టు ఎలాంటి ఆధారం లేకపోయినా సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు పిటిషన్లు, అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు వేయడంపై చీఫ్ జస్టిస్‌తో కూడిన బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అప్పీళ్లు వేయడాన్ని తప్పుబట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చినకొండూరు పరిధిలోని సర్వే నంబర్ 251లోని 6.37 ఎకరాలకు సంబంధించి గూడూరు పద్మ తదితరులు వేసిన అప్పీళ్లను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. అనవసరంగా అప్పీల్ చేసినందుకు పిటీషనర్‌కు జరిమానా విధించింది. సివిల్ కోర్టులో దావాను ఉపసంహరించుకున్న విషయాన్ని అప్పీల్లో చేప్పకపోవటం వల్ల ఈ జరిమానా విధించినట్టు న్యాయస్థానం తెలిపింది.
ఈడీకి నోటీసులు...
నోట్ల రద్దు సమయంలో బ్లాక్ మనీతో బంగారం కొన్నారనే ఆరోపణలతో ఈడీ తమ ఆస్తుల జప్తు చేయడం అన్యాయమంటూ భజరంగ్ పరిషత్ జ్యూవెల్లర్స్ ఎమ్డీ నవీన్ సంఘీ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్ ఆస్తులను జప్తు చేసిన ఆరు నెలల్లోగా అప్పిలేట్ అథారిటీకి నివేదించి ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలన్న నిబంధనను ఈడీ ఉల్లంఘించిందంటూ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది డి.శ్రీనివాస్ వాదించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని ఆదేశించిన హైకోర్టు విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
తెలుగులో పేపర్‌పై వివరణ ఇవ్వండి...
జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షా పేపర్లను ఇంగ్లీషుతోపాటు తెలుగులో కూడా ముద్రించే విషయంపై వివరణివ్వాలంటూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. గతేడాది సర్వీస్ కమిషన్ వెలువరించిన నోటిఫికేషన్లో పరీక్ష పేపరును ఇంగ్లీషులో ఇస్తామంటూ కమిషన్ పేర్కొంది.. అయితే ఆంగ్లంతోపాటు తెలుగులో కూడా ఇస్తేనే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొంటూ విజరు కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ కె.శరత్ విచారించారు. ఈ కేసులో సర్వీస్ కమిషన్ వివరణ నిమిత్తం విచారణను మార్చి 12కి వాయిదా వేశారు.
'ఓబుళాపురం'లో మంత్రి పాత్ర ఉంది...
ఏపీలోని ఓబుళాపురంలో ఇనుప ఖనిజ తవ్వకాలకు సంబంధించిన లీజు మంజూరులో అక్రమాలు జరిగాయనీ, ఇందులో అనాటి గనుల శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ సీబీఐ... రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేయడం సమర్థనీయ మేనని స్పష్టం చేసింది. సంబంధిత ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి సబిత దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కూడా కొట్టేయాలని కోరింది. 'బోబుళాపురం'తో తనకెలాంటి సంబంధమూ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలు వాస్తవం కాదని వివరించింది. దీనిపై మంత్రి తరపు లాయర్ స్పందిస్తూ... ఈ కేసులో ఏ ఒక్క సాక్షి కూడా ఆమెపై ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు.
పాత చార్జిషీట్లోని అంశాలతోనే మరో చార్జిషీటు దాఖలు చేయటం ద్వారా మంత్రి పేరును ఇరికించారని చెప్పారు. వాదనల అనంతరం విచారణను మార్చి మూడో వారానికి వాయిదా వేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు.