Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కంటి వెలుగు, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, జీవో నెం.58,59,76 ప్రకారం క్రమబద్ధీకరణ, ఆయిల్ పామ్ సాగు తదితరాంశాలపై ఆమె శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి కొనసాగిన ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ... కంటి వెలుగులో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కృషి చేసినందుకు కలెక్టర్లను అభినందించారు. లబ్దిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జీవోనెం.58,59,76 కింద పట్టాల పంపిణీని ప్రారంభిం చాలనీ, మార్చి చివరి నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాప్...
ఇటీవల సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో అలాంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని సీఎస్... ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారులతో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని వాణిజ్య సముదాయాల్లో ప్రమాదాల నివారణకు పరికరాలను, హెచ్చరికలు జారీ చేసే అలారాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వాణిజ్య సముదాయాలు, భవనాల్లోని సెల్లార్లతోపాటు బిల్డింగ్ పై భాగాల్లో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.