Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్‌భవన్ స్పష్టత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం పుదుచ్చేరి నుంచి నేరుగా నిమ్స్ ఆస్పత్రికి గవర్నర్ వెళ్లారని రాజ్‌భవన్ పేర్కొంది. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంప్రదించి, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించారని తెలిపింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారని పేర్కొంది. ఆ సమయంలో గవర్నరు వాహనంలో పూలదండ ఉండటంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. నిజానికి గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుని ఆలయం దర్శించుకుని ఆ తర్వాత రాజ్‌భవన్‌కు రావడమనేది చాలా కాలంగా పాటించే ఆనవాయితీ అని వివరించింది. దానిలో భాగంగానే కారులో హనుమంతుని గుడిలో సమర్పించేందుకు పూలదండ ఉంచడం జరిగిందని పేర్కొంది. దానికి విపరీతార్ధాలు తీయటం సహేతుకం కాదని స్పష్టం చేసింది. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కూడా గవర్నర్ ప్రార్ధన చేశారని గుర్తు చేసింది. రాజ్‌భవన్‌కు వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిందిగా ఒక లేఖ రాశారని తెలిపింది. కాబట్టి గవర్నర్ నిమ్స్ పర్యటనను సరియైన దృష్టితో అర్ధం చేసుకోవాలని రాజ్ భవన్ విజ్ఞప్తి చేసింది.