Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58 అమలు పర్చి పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 44 కేంద్రాల్లో 28వేల గుడిసెల నిర్మాణం జరిగిందనీ, ఏడాదిగా ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారని చెప్పారు. పెద్దలకు ఉపయోగపడే జీవో నెంబర్ 59 అమలు చేసినప్పుడు, పేదలకు చెందిన జీవో నెంబర్ 58 ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడి సీపీఎం కార్యాలయంలో ఆర్ వెంకట్రా ములు అధ్యక్షతన గుడిసెల పోరాట ప్రజాసంఘాల బాధ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడారు. ఇండ్లు, స్థలాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కాలయాపన చేసిందని అన్నారు. పేదల స్థలాలకు పట్టాలిచ్చి, ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులకు 120 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జీ నాగయ్య, పట్నం రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ, కార్యదర్శి టీ సాగర్, సీఐటీయూ నాయకులు జే వెంకటేష్, భూ కేంద్రాల నాయకులు బందు సాయిలు, చిట్టిబాబు, రమేష్, సాగర్, యాదగిరి, బషీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.