Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయంగా తెలంగాణకు 4వ స్థానం
- 20వ బయో ఏషియా సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ ప్రపంచ హబ్‌గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో టాప్-10లో తెలంగాణ 4వ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో మూడ్రోజులపాటు నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సును నిటిఅయోగ్ సభ్యులు వీకేపాల్తో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థలకు నిలయంగా ఉందన్నారు. ఇక్కడ ఎనిమిది వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే మూడింట ఒక వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలోనే జరుగుతున్నదని వెల్లడించారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50శాతం తెలంగాణ నుంచే జరుగుతుందన్నారు. లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అవతరించిందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. ఏడేండ్లలోనే మూడు బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. నగరంలో 20కిపైగా లైఫ్‌సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని తెలిపారు. లైఫ్‌సైన్సెస్ రంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. 2023కుగాను 'జీనోమ్ వ్యాలీ' ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నామని మంత్రి తెలిపారు.