Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తరిస్తున్న వైద్య వ్యాపారం
ఉత్తర తెలంగాణలోనే ఆస్పత్రుల హబ్‌గా ఉన్న కరీంనగర్ జిల్లా 'క్యాష్'పిటల్ హబ్‌గా మారింది. వైద్యంలో ఓనమాలు కూడా తెలియని లీడర్లు, రియల్టర్లు, బిల్డర్లు, ఫైనాన్షియర్లు, బడా వ్యాపారులు పదుల సంఖ్యలో వైద్య రంగంలోకి వచ్చారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే 260 ప్రయివేటు ఆస్పత్రులు ఉండగా.. ఇందులో సుమారు వందకుపైగా ఆస్పత్రులు నాన్ డాక్టర్స్ ఆధ్వర్యంలోనే నడుస్తు న్నాయి. విజిటింగ్ డాక్టర్లు, అర్హతలేని ఫారిన్ సర్టి ఫికెట్ డాక్టర్లతో కార్పొరేట్‌ను తలదన్నేలా అద్దాల మేడల్లో వైద్య వ్యాపారాన్ని సాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. ఆర్ఎంపీ, పీఎంపీ, ప్రయివేటు ల్యాబ్టెక్నీషియన్లు, అంబులెన్స్ డ్రైవర్లను ఏజెంట్లుగా మలుచుకుని.. పీఆర్ఓలు, మార్కెటింగ్ సిబ్బందిని నియమించుకుని 'రెఫరల్' కేసుల బిల్లుల్లో కమీషన్లు, గిప్టులు, ట్రిప్పులు అందిస్తు న్నారు. వైద్యం వికటించి ప్రాణాలమీది కొచ్చి నప్పుడు నయానో బయానో బాధితులకు కొంత ముట్టచెప్పి చేతులుదులుపుకుంటూ యథావిధిగా తమ దందా సాగిస్తున్నారు.
- ఓనమాలు తెలియని వారూ వైద్య రంగంలో పెట్టుబడులు
- పదుల సంఖ్యలో పెరిగిన నాన్ డాక్టర్స్ అనుమతులు
- ప్రాణం మీదకొచ్చినా అర్హత లేని వైద్యులతో హైరిక్స్ ఆపరేషన్లు
- పీఆర్ఓలు, మర్కెటింగ్ సిబ్బందితో వ్యాపార విస్తరణ
- 'రెఫరల్ కేసులు అందిస్తే కమీషన్లతోపాటు గిప్టులు, ట్రిప్పులు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రెండు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నగరాలు, పట్టణాలు సహా చిన్న టౌన్లు, మండల కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ పేర్లతో ప్రయివేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆ ఆస్పత్రుల్లోని బోర్డుల్లో ఉండే స్పెష లిస్టులు హాస్పిటల్లో కనిపించరు. వారి స్థానంలో అర్హత లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎంబీబీఎస్‌లు.. ఎండీలుగా, సర్జన్లుగా చలామణి అవుతుంటే, ఇంకొన్ని చోట్ల హోమియో, ఆయుర్వేద వైద్యులు స్పెషలిస్టులుగా చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నారు. చాలా చోట్ల ఆర్ఎంపీలు, పీఎంపీలు నర్సింగ్‌హోంలు నిర్వహిస్తుండటం గమనార్హం.
నెలవారీ మామూళ్లు.. నేతల ఒత్తిళ్లు
సరైన అర్హతలు లేకున్నా పేషెంట్లను చేర్చుకొని చికిత్స చేస్తున్న ఆస్పత్రుల్లో.. రోగి ఆరోగ్యంతో బయటపడితే తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. పరిస్థితి విషమిస్తే హైదరాబాద్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. పేషెంట్ అక్కడే చనిపోతే రూ.లక్షల్లో డబ్బులిచ్చి సెటిల్మెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రయివేటు ఆస్పత్రులను నియంత్రించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నెలవారీగా వచ్చే మామూళ్లు.. ఆస్పత్రులకు అండగా ఉన్న ప్రభుత్వ నేతల ఒత్తిళ్ల నడుమ అది తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చాలా ఆస్పత్రులకు, వాటికి అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు, మెడికల్ షాపులకు రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు లేకున్నా పట్టించుకోవడం లేదు. పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
నాన్ డాక్టర్స్ ఆస్పత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎన్.రావు
నాన్ డాక్టర్స్ ఆస్పత్రుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోగులను ఆస్పత్రిలో చేర్పించే సమయంలో పూర్వాపరాలు తెలుసుకోవాలి. నాన్ డాక్టర్స్ ఆస్పత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి ఆస్పత్రులపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి.
బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్ బైక్‌పై మంచిర్యాల వైపు వస్తుండగా.. అదుపుతప్పి గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా.. అక్కడే కాచుకుని ఉన్న ఓ అంబులెన్స్ డ్రైవర్ బాధితుని బంధువులతో మాట కలిపి కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి రెఫర్ చేయించాడు. వారంపాటు వైద్యం అందించిన సదరు ఆస్పత్రి యాజమాన్యం శ్రీనివాస్‌కు స్కానింగ్, చిన్న సర్జరీ, మందులు, ఇతర ఖర్చులు కలుపుకుని రూ.1.20లక్షల బిల్లు వేసింది. ఇంత పెద్దమొత్తంలో బిల్లు ఏంటని ప్రశ్నించి.. చివరకు అప్పుజేసి డిశ్చార్జ్ అయ్యాడు. ఇది ఒక్క శ్రీనివాస్ ఉదంతమేకాదు.. యాక్సిండెంట్, ఇతర అనారోగ్య సమస్యలతో రెఫరల్‌గా వచ్చే ఏ రోగికి అయినా రూ.లక్షకుపైగా బిల్లులు వేస్తున్న తీరు కరీంనగర్ జిల్లాలో షరామామూలుగానే మారిపోయింది.
ఇటీవలి ఘటనలు..
- కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాలకు చెందిన చిమ్మని స్రవంతి గాల్‌బ్లాడర్ సమస్యపై జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ వికటించడంతో శనివారం పరిస్థితి విషమించి మరణించింది. సరిగ్గా నెల కిందట అల్గునూర్‌కు చెందిన నేరెళ్ల మహేష్‌కు అపెండిసైట్ ఆపరేషన్‌ను నిర్లక్ష్యంగా చేసిన ఓ ప్రయివేటు హాస్పిటల్లో రెండు రోజులకే మళ్లీ సర్జరీ చేశారు. చివరకు పరిస్థితి విషమించి రోగి చనిపోయాడు.
- మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ ఆరేండ్ల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రయివేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా డెలివరీ చేయించుకుంది. ఆ సమయంలో సదరు వైద్యురాలు కడుపులోనే కత్తెర మరిచిపోయింది. తరచూ కడుపునొప్పి వస్తుండటంతో శనివారం స్కానింగ్ చేయించుకుంటే కడుపులో కత్తెర ఉన్నట్టు గుర్తించారు. ఇదే విషయమై సదరు ఆస్పత్రి వైద్యురాలిని నిలదీయగా, ఆ మహిళ కడుపులో కత్తెరను తొలగించేందుకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చి హైదరాబాద్‌కు తరలించారు.