Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమున్న చోట ప్రాజెక్టులు నిర్మించాలి
- దక్షిణ తెలంగాణ లక్షల ఎకరాలకు నీరు లేదు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఆయకట్టు స్థిరీకరణ చేయకుండా.. వేలాది ఎకరాలను ముంపుకు గురిచేసి రైతులను నిర్వాసితులను చేసి ప్రాజెక్టులు ఎందుకు నిర్మాణం చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలో నిర్మిస్తున్న చిన్నోనిబాయి రిజర్వాయర్ పనులను నిలిపేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న నిర్వాసితులకు శనివారం ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాగునీటి కోసమే చేశారని గుర్తు చేశారు. కానీ, సాగునీటి అవసరం లేకుండా భూములు కోల్పోయేలా ప్రాజెక్టులు నిర్మించడం సరికాదన్నారు. ఏ ప్రాంతంలో సాగునీరు అవసరం ఉందో జిల్లాల వారీగా సర్వే చేసి ప్రాజెక్టులు నిర్మించాలి తప్ప చిన్నోనిపల్లి లాంటి ఆయకట్టు లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించడం అవివేకమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి దానినే మోడల్‌గా చూపించడం సరికాదన్నారు. దక్షిణ తెలంగాణలో లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టుల వల్ల రైతుల్లో ఆనందం వెళ్లివిరియల్సిందిపోయి అడ్డుకునే స్థాయికి వచ్చారంటే పాలకుల ముందు చూపు ఏంటో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలిస్తే భూములకు సాగునీరు ఇవ్వడం కంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ముట్టజెప్పడమే ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుందన్నారు. రిజర్వాయర్ల ద్వారా సాగు భూములు తడపాల్సింది పోయి రైతులను నిర్వాసితులను చేసి వారకి కన్నీళ్లు తెప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిమిత సమయంలో భూములను ఉపయోగంలోకి తీసుకురాకపోతే స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగి రైతులకు ఇచ్చేయాలని చెప్పారు. ఆ చట్ట ప్రకారం 17 సంవత్సరాలు దాటినా వాడుకోని భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాల భూములను సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తీసుకొని మార్కెట్ ధర కన్నా తక్కువగా పరిహారం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతులు ఉద్యమాలు చేసినందువల్ల ఎకరాకు 60 లక్షలు పరిహారం ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎం) ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి, ఉద్యమ కన్వీనర్ నరేష్, నాయకులు నరసింహ, నర్మద, దేవదాస్, పరంజ్యోతి, ఆంజనేయులు, మారన్న, సవారన్న మద్దిలేటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.