Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటితోనే విద్యకు పరిపుష్టి
- న్యాయ పుస్తకాలే కాదు... ఇతర పుస్తకాలూ చదవాలి
- నల్సార్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సానుభూతి, దయ వంటి విలువైన లక్షణాలను అలవర్చుకోవాలనీ, వాటితోనే చదువుకున్న విద్య పరిపుష్టి అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్ విద్యార్థులకు సూచించారు. శనివారం హైదరాబాద్ జస్టిస్ సిటీలోని నల్సార్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం, రజతోత్సవం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సానుభూతి విలాసవంతమైనదేమీ కాదంటూ, అది న్యాయం పొందేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని తెలిపారు. భారీ సంఖ్యలో వచ్చే వాహన ప్రమాద కేసుల విషయంలో అనేక సాంకేతిక అంశాలున్నప్పటికీ సానుభూతితోనే సుప్రీంకోర్టు వాటిని పరిష్క రిస్తుందని ఉదహరించారు. స్నాతకోత్సవ శుభ సందర్భంలో విద్యార్థులు సమాజంలోని అనేక విషయాలను తెలుసుకునేందుకు ఉన్న అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. వేల ఏండ్ల సంవత్సరాల తరవాత విద్యనభ్యసించే అవకాశమొచ్చిన అట్టడుగు వర్గాల విద్యార్థుల్లో ఆత్మహత్యలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన ముంబయి, ఒడిశాలో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు విద్యార్థుల ఉదంతాలను ఉదహరించారు. తాత్విక దృక్కోణం, దయా దృష్టితో ఉన్నత విద్య ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి తరం విద్యార్థులకు లోతైన జ్ఞానం, సమాచారం పొందే అవకాశాలొ చ్చాయని తెలిపారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు కేవలం బోధనా సిబ్బందిని మాత్రమే గుర్తుంచుకోవడం కాదనీ, ఆ విద్యాసంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన సిబ్బంది, వర్కర్లను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు గుర్తించిన జీవించే హక్కులో భాగమైన ఆత్మగౌరవానికి అదే నిజమైన అర్థమని తెలిపారు. కేవలం చట్టం, న్యాయానికి సంబంధించిన పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలను చదవడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కోర్టు దృష్టిలో అందరూ సమానులేనని తెలిపారు. అధికారం మరింత బాధ్యతతో కూడుకుని ఉంటుందన్నారు. సమాజంలో న్యాయం దక్కని వ్యక్తికి దానిని అందించేందుకు దయ ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు. అది న్యాయానికి ఉండే ముఖ్యమైన కోణమని వివరించారు. విద్యార్థుల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకే పరిమితం కాకుండా జీవితానికి ముఖ్యమైన సానుభూతిని పెంచడంపై దృష్టి సారించాలని జస్టిస్ చంద్రచూడ్ విద్యాసంస్థలకు సూచించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భయాన్ అధ్యక్షత వహించగా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణారావు స్వాగతోపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.విద్యుల్లత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.