Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ- హన్మకొండ
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి సాంబరాజు శ్వేతా డిమాండ్ చేశారు. శనివారం అదాలత్ సెంటర్లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా ఐద్వా మండల అధ్యక్షులు బుడిద రాధ, కార్యదర్శి శ్వేతాలు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థిని డాక్టర్ ప్రీతికి న్యాయం చేయాలని, సైఫ్‌తోపాటు కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలన్నారు. డాక్టర్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుండే సీనియర్ విద్యార్థి సైఫ్ ఖాన్ వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో ప్రిన్సిపాల్ మధుసూదన్, హెచ్ఓడీ నాగార్జున రెడ్డికి ప్రీతి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆమె ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేమున్నాం కదా మీరెందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని అక్కడున్న హెచ్ఓడీ ప్రీతిని మందలించారన్నారు.
కాలేజ్ మేనేజ్‌మెంట్‌తోపాటు సైఫ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నా, ప్రత్యేకంగా షీ టీమ్స్ ఉన్నా మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో సుకర్ణ, విజయ, రాణి, ప్రేమలత, స్రవంతి, కవిత, సుజాత, లక్ష్మీ, యశోద పాల్గొన్నారు.