Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 2,24,967 లక్షలు మాయం
- బాధితుడు పరకాల ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్
నవతెలంగాణ-పరకాల
సైబర్ నేరగాళ్లు.. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌కే వల విసిరారు. బ్యాంకు ఖాతాదారులను అప్రమత్తం చేయాల్సిన అధికారి నేరగాళ్ల మాయలో పడి అకౌంట్ ఖాళీ చేసుకున్నారు. ఖాతా నుంచి రూ.2,24,967 మాయమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పరకాల ఎస్బీఐ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్‌గా సకల్ దేవ్ సింగ్ పని చేస్తున్నాడు. రెండ్రోజుల కిందట ఆయన మొబైల్‌కు 'మీ ఖాతా డీ యాక్టివేట్ అవుతుంది. పాన్ కార్డు అప్డేట్ చేయండి' అని మెసేజ్ వచ్చింది. ఆయన శుక్రవారం ఉదయం ఆ మెసేజ్‌ను క్లిక్ చేసి అప్డేట్ చేసేందుకు ప్రయత్నించగా సక్సెస్ కాలేదు. అనంతరం మరో నంబర్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను చెప్పినట్టు చేయాలని అవతలి వ్యక్తి సూచించగా.. బస్సులో ఉన్నాను తర్వాత చేస్తానని సకల్ దేవ్‌సింగ్ చెప్పారు.
బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఆయనే తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్డేట్ చేయాలని సూచించగా కావడం లేదని చెప్పారు. ఆ వెంటనే వాట్సాప్‌కు ఒక లింక్ పంపానని, దాన్ని ఓపెన్ చేయాలని ఆ వ్యక్తి చెప్పాడు. ఈ మేరకు వేరే నంబరు నుంచి లింక్ పంపించగా దాన్ని మేనేజర్ ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఖాతాలోంచి రూ.2,24,967 కట్ అయ్యాయి. దీంతో శుక్రవారం రాత్రి పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరం కింద పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.